విద్యుత్ పునరుద్ధరణలో జాప్యంపై కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం: యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని ఆదేశం
మచిలీపట్నం :
‘అర్నాబ్’ తుఫాను ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలుల కారణంగా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ డీకే బాలాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు విద్యుత్ పునరుద్ధరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని, అదనపు సిబ్బందిని మరియు సామగ్రిని సమకూర్చుకుని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం, పెడన పట్టణాల్లో కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించారు.
మచిలీపట్నంలో 15 వేల మంది వినియోగదారులపై ప్రభావం
తుఫాను ధాటికి మచిలీపట్నం పట్టణ పరిధిలో 11 కేవీకి చెందిన ఐదు ఫీడర్లు నిలిచిపోవడంతో దాదాపు 15,000 మంది విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మచిలీపట్నంలో 5 బృందాలు పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, పనుల వేగాన్ని పెంచేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్లో ఉన్న 15 ట్రాన్స్ఫార్మర్ల పునరుద్ధరణ పనులను నేటి సాయంత్రంలోగా పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
పెడనలో ప్రత్యక్ష పర్యవేక్షణ
పెడన పట్టణంలో 33 కేవీ విద్యుత్ లైన్ నిలిచిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా పరిశీలనకు వెళ్లారు. ఏపీసీపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ), జిల్లా మరియు డివిజన్ స్థాయి అధికారులతో క్షేత్రస్థాయిలోనే పనుల స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ఒంగోలు నుంచి అదనపు సిబ్బంది రాక
పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఒంగోలు నుంచి ప్రత్యేక విద్యుత్ సిబ్బంది బృందాలు చేరుకుంటున్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. నిరంతర పర్యవేక్షణతో పనులు పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కలెక్టర్ ఆదేశించారు.

