నిర్ణీత గడువులోగా పింఛన్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి: కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
NTR భరోసా పింఛన్ పథకం కింద నూతన పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత నిర్ధారణ ప్రక్రియలను ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితిలోనే పారదర్శకంగా పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నూతన పింఛన్ల ప్రక్రియపై సోమవారం ఆయన ఎంపీడీవోలు, డీఎల్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పీడీ-డీఆర్డీఏ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మెమో (No.3407491/RD.I/A1/2026, తేదీ: 06.09.2026) ప్రకారం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా నూతన దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో పాటు e-KYC ధృవీకరణ చేపట్టాలని సూచించారు.
పింఛన్ల పరిశీలన మార్గదర్శకాలు
* డేటాబేస్ పరిశీలన: దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన అనంతరం సాధారణ అర్హత ప్రమాణాలు, పాత డేటాబేస్ ఆధారంగా ధృవీకరించాలి.
* క్షేత్రస్థాయి తనిఖీ: అర్హత ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో భౌతికంగా పరిశీలించి సమర్పించిన ధ్రువపత్రాలను సరిచూడాలి.
* సిఫార్సు మాత్రమే చేయాలి: MPDO/మున్సిపల్ కమిషనర్లు పింఛన్లను నేరుగా మంజూరు చేయరాదని, కేవలం నివేదికలు పరిశీలించి అర్హులైన వారిని ఉన్నతాధికారుల ఆమోదానికి సిఫార్సు చేయాలని స్పష్టం చేశారు. తుది ధృవీకరణ, బడ్జెట్ ప్రతిపాదనల అనంతరం ప్రభుత్వ ఆమోదంతో పింఛన్లు మంజూరవుతాయని తెలిపారు.
నిర్దేశిత కాలపరిమితి వివరాలు
* సెప్టెంబర్ 7 – 16: దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, e-KYC (7 పని దినాలు)
* సెప్టెంబర్ 17 – 21: సాధారణ అర్హత పరిశీలన (3 పని దినాలు)
* సెప్టెంబర్ 22 – 24: భౌతిక పరిశీలన, అర్హత నిర్ధారణ, సిఫార్సు (3 పని దినాలు)
* సెప్టెంబర్ 25 – 26: బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదం (2 పని దినాలు)
అర్జీదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
పింఛన్ల కోసం వచ్చే అర్జీదారులతో సిబ్బంది మర్యాదగా, సహాయక దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ఒకవేళ ఎవరైనా అనర్హతకు గురైతే దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. మొత్తం ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

