MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

మంగినపూడి బీచ్‌ తీరంలో 63 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం పనుల పరిశీలన

  • August 14, 2026
  • 0 min read
మంగినపూడి బీచ్‌ తీరంలో 63 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం పనుల పరిశీలన

రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు పనుల పురోగతి పరిశీలన

మచిలీపట్నం :

వినాయక చవితి సందర్భంగా మంగినపూడి బీచ్ సాగర తీరంలో ఏర్పాటు చేస్తున్న 63 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం పనులను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. మహాగణపతి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించడానికి ముందు మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం. నవీన్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులతో కలిసి శుక్రవారం మంగినపూడి బీచ్ తీరాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న గణపతి విగ్రహ నిర్మాణ పనులను, పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర విగ్రహ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున విగ్రహం ఏర్పాటు ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. 63 అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, పార్కింగ్, ట్రాఫిక్, భద్రత, అగ్నిమాపక తదితర ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ విగ్రహ నిర్మాణం, ఏర్పాటు ప్రాంతంలో నిర్మాణ భద్రత, భక్తుల రాకపోకలు, పారిశుద్ధ్యం తదితర అంశాలను ముందుగానే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, క్యూ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై పోలీస్ శాఖ తరఫున చేపట్టనున్న ఏర్పాట్లను వివరించారు. మహాగణపతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పరిశీలనలో బందరు ఆర్డిఓ కే సాంబశివరావు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మెహర్ బాబా ప్రసాద్, ఉత్సవ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

About Author

SSN