మడ అడవుల విధ్వంసంపై విచారణకు ఆదేశం: APCZMA మెంబర్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిన పర్యావరణ ముఖ్యకార్యదర్శి
కృతివెన్ను:
కృష్ణాజిల్లా, కృతివెన్ను మండలం పరిధిలోని ఇంతేరు బీచ్ నుండి ఉర్లగొంది తిప్ప వరకు విస్తరించి ఉన్న మడ అడవుల విధ్వంసంపై రాష్ట్ర పర్యావరణ మరియు అటవీశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత యాజమాన్య సంస్థ (APCZMA) మెంబర్ సెక్రటరీ ఎస్. శ్రీశరవణన్ ను విచారణ జరిపాల్సిందిగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సముద్రపు అలలకు దగ్గరగా, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలను ఉల్లంఘిస్తూ మడ అడవులకు రెండు వైపులా చెరువులను తవ్వి ఆక్వా సాగు చేస్తున్నారని ఆర్.టి.ఐ. కార్యకర్తలు జంపాన శ్రీనివాసగౌడ్, బేతపూడి జోగేశ్వర రావు, శిరివెళ్ల గౌరి లు పర్యావరణ ముఖ్యకార్యదర్శికి జూలై 13, 2026న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ముఖ్యకార్యదర్శి విచారణకు ఆదేశాల నిచ్చారు.
మడ అడవుల విధ్వంసం వల్ల తీరప్రాంతాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నరికివేతపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం, అటవీశాఖ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ, పంచాయతీ అధికారుల దృవీకరణ పత్రాలతో విద్యుత్ శాఖ అధికారులు ఆక్వా సాగుకు విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

