మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్ లో న్యాయ సహాయ క్లినిక్ ప్రారంభం
మచిలీపట్నం:
జిల్లాలో పనిచేస్తున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు న్యాయ సహాయం అందించడానికి ప్రత్యేకించి ఏర్పాటుచేసిన క్లినిక్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుట్టాల గోపి కోరారు. మంగళవారం సాయంత్రం నగరంలోని ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ బస్టాండ్ లో నూతనంగా ఏర్పాటుచేసిన న్యాయ సహాయ క్లినిక్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్ వరలక్ష్మి తో కలిసి ప్రారంభించారు..
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మణిపూరు, త్రిపుర, మిజోరం చుట్టుపక్కల ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులు వివిధ రకాల పనుల కోసం జిల్లాలో పనిచేస్తున్నారని, వారికి అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సహాయం అందించే ఉద్దేశంతో న్యాయ సహాయ క్లినిక్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈశాన్య రాష్ట్రాల వలస కార్మికులకు ఉపాధిలో ఏమైనా సమస్యలు ఏర్పడితే ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అలాంటి వాళ్లకు సత్వర న్యాయం అందించేందుకు అత్యున్నత న్యాయస్థానం, జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలు సంయుక్తంగా ఏపీఎస్ఆర్టీసీ వారి సహకారంతో న్యాయ సహాయ క్లినిక్ ను ఏర్పాటు చేశామన్నారు.
పురప్రజలకు వలస కార్మికులుగా పనిచేస్తున్న వారికి ఎవరికైనా ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయ సహాయ క్లినిక్ సంప్రదించేలా తెలియజేయాలన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఈ క్లినిక్ లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. న్యాయ సహాయం అందించడానికి ప్రత్యేకించి ఒక న్యాయ సహాయ కౌన్సిలర్ అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో డిపిటివో వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్ డిపో మేనేజర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

