MachilipatnamLocal News
June 19, 2026
జిల్లా

కూచిపూడి గ్రామంలో యోగా కార్యక్రమం నిర్వహించిన జిల్లా యంత్రాంగం

  • June 16, 2026
  • 1 min read
[addtoany]
కూచిపూడి గ్రామంలో యోగా కార్యక్రమం నిర్వహించిన జిల్లా యంత్రాంగం

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు పాల్గొన్న పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్..

కూచిపూడి:

యోగా ద్వారా డయాబెటిస్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించుకోవచ్చని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు, సమాజం, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు.

అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం–2026 వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మొవ్వ మండలం, కూచిపూడి గ్రామంలోని జిమ్ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తదితరులు ఉత్సాహంగా పాల్గొని ప్రజలతో పాటు సామూహిక యోగాసనాలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుండి యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి ఆసనాలు వేసే విధానాన్ని ప్రదర్శిస్తూ వారిచేత చేయించారు. అనంతరం యోగ ప్రతిజ్ఞ చేయించారు.

ప్రజలు మైదానంలో ఆసనాలు వేసేందుకు వీలుగా పచ్చని తివాచీలను ఏర్పాటు చేశారు. పెద్ద బ్యానర్ పై కూచిపూడి నృత్య భంగిమ ఆకృతిని ముద్రించి, వచ్చిన ప్రజలను ఆ ఆకృతిలో కూర్చోబెట్టి ఆసనాలు నిర్వహించిన దృశ్యం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసి వారికి అల్పాహారం, తాగునీరు అందించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు జబ్బుల బారిన పడకముందే వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వ్యాధులను నివారించడం యోగాంధ్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. నిత్య యోగాభ్యాసం ద్వారా డయాబెటిస్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వంటి నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీలు) ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే వైద్య చికిత్సల కోసం అయ్యే ఖర్చులు తగ్గడంతో పాటు ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు.

యోగా శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు. యోగాభ్యాసం వల్ల మానసిక చురుకుదనం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పనిని సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం పెరిగి ఉత్పాదకత మెరుగుపడుతుందని చెప్పారు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు. చిన్నారులు చిన్న వయస్సు నుంచే యోగాను అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. యోగా వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరిగి విద్యాభ్యాసంలో మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, చురుకైన జీవితాన్ని గడపగలరని తెలిపారు.

యోగాను కనీసం ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా అభ్యసిస్తే దాని సానుకూల ఫలితాలను ప్రతి ఒక్కరూ స్పష్టంగా గమనించగలరని అన్నారు. ప్రజలందరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

పామర్రు శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ యోగ కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనస్సు, శరీరం, ఆత్మలను సమన్వయం చేసే గొప్ప జీవన విధానమని అన్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన కానుక యోగ అని, ప్రతి భారతీయుడు దానిని ఆచరించాల్సిన బాధ్యత ఉందన్నారు.

రోజుకు అరగంట లేదా గంట సమయం యోగా కోసం కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి, ఆందోళనలను అధిగమించవచ్చన్నారు. ముఖ్యంగా నేటి యువత తరంలో పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కోవడంలో యోగ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యోగాను ప్రతి కుటుంబంలో ఒక దినచర్యగా మార్చుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కూచిపూడి గ్రామం చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళకు పుట్టినిల్లు అయిన ఈ ప్రాంతం నాలుగు వందల ఏళ్లకు పైగా గొప్ప వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. గతంలో వేలాది మంది కళాకారులు ఒకే వేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయాన్ని ప్రస్తావించారు. దేశ విదేశాల నుంచి కళాకారులు, కళాభిమానులు కూచిపూడికి రావడం ఈ ప్రాంత ప్రత్యేకతకు నిదర్శనమన్నారు. ఈ చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూచిపూడి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, గ్రామంలోని కోనేరును అభివృద్ధి చేసేందుకు కోట్ల రూపాయల వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కూచిపూడి పరిసర ప్రాంతాల్లో రహదారి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, సాంకేతిక కారణాల వల్ల నిలిచిన కొన్ని పనులు కూడా త్వరలో పూర్తి చేసి వచ్చే ఆరు నెలల్లో అన్ని ప్రధాన రహదారులను మెరుగుపరుస్తామని చెప్పారు.

కార్యక్రమంలో యోగా శిక్షకులు నాగరాజు, శేష ప్రసన్న ఆధ్వర్యంలో యార్లగడ్డ ఫౌండేషన్ విద్యార్థులు చేసిన యోగా నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. నాట్య గురువు డాక్టర్ వేదాంత రాదే శ్యామ్ తన నృత్య ప్రదర్శనతో యోగా ప్రియులను ఉత్సాహపరిచారు. ఈ
కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డీవో ఎస్ కరుణ కుమారి, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ దోనెపూడి శివరామయ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి జి రామలక్ష్మణరావు, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి ఝాన్సీ లక్ష్మి, జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరావు, ఎస్జిఎస్డబ్ల్యూ డిసిఓ రవికాంత్, తహసిల్దార్ మస్తాన్, ఎంపీడీవో సుహాసిని, ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ వాహిని, యోగ గురువు మద్దాల చింతయ్య, విద్యార్థులు, ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN