మచిలీపట్నం కలెక్టరేట్లో సెప్టెంబరు 17న ‘ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్’
* పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
* హాజరుకానున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అన్ని శాఖల అధికారులు
మచిలీపట్నం :
కృష్ణా జిల్లాలో పారిశ్రామిక, వ్యాపార రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్లో ‘ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్’ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. ఇటీవల కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్ప్రెన్యూర్’ వర్క్‌షాప్‌కు లభించిన స్పందనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియో సందేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
అనుమతులు & ప్రభుత్వ సహకారం: కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ శాఖల నుంచి రావలసిన అనుమతులు, ఇతర సహాయ సహకారాలపై అధికారులతో ప్రత్యక్షంగా చర్చించే అవకాశం కల్పిస్తున్నారు.
సమస్యల తక్షణ పరిష్కారం: ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తూ సమస్య ఎదుర్కొంటున్న వారు తమ విన్నపాలను కలెక్టర్ సమక్షంలో జిల్లా యంత్రాంగానికి విన్నవించుకోవచ్చు. చట్టపరమైన పరిధిలో వీటిని త్వరగా పరిష్కరిస్తారు.
ఇతర ప్రాంతాల వారికీ ఆహ్వానం: కృష్ణా జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న ఇతర ప్రాంతాల వ్యాపారవేత్తలు కూడా ఈ బిజినెస్ మీట్‌కు హాజరుకావచ్చు. ఆసక్తి ఉన్న వ్యాపారవేత్తలు, ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మరింత సమాచారం కోసం 9989092288 నంబర్‌ను సంప్రదించవచ్చు.

