MachilipatnamLocal News
May 24, 2026
స్పెషల్ స్టోరీ

కృష్ణాజిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి…

  • May 23, 2026
  • 0 min read
[addtoany]
కృష్ణాజిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి…

కూటమిలో నెలకొన్న విభేదాలను పరిష్కరించాలి…
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కలసి పనిచేస్తేనే ఫలితాలు ఉంటాయి…

మచిలీపట్నం:

కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే నిజాయితీ పాలన అందిస్తామని, ప్రజలకు సంక్షేమాలను అందించడంలో ముందు ఉంటామని ఎన్నికల సమయంలో హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చారు. 2024 లో జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మరోసారి వస్తుందని ఆ పార్టీకి చెందిన వారంతా ఆశపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. ఫలితాలు వేరుగా వచ్చాయి.

వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు అందించడంలో ముందే ఉన్నారు. అధికారంలోకి రెండోసారి రావాల్సిందే.. కానీ రాలేదు. అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనలో పలువురు మంత్రులు, శాసనసభ్యులు అవినీతికి పాల్పడుతున్నా వారిని కట్టడి చేయకపోవడం. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులు, ఇళ్ల స్థలాల కొనుగోలులో, అక్రమంగా మట్టి తవ్వకాలలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు విమర్శలు వచ్చినా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవినీతి మంత్రులపై, శాసనసభ్యులపై చర్యలు తీసుకోకపోవడం. కనీసం అటువంటి వారిని హెచ్చరించకపోవడం పట్ల ప్రజల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విముఖత ఏర్పడింది. వీటితోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ పార్టీని విమర్శిస్తున్నారన్న కారణాలతో జైలులో పెట్టించడం, చంద్రబాబు నాయుడుని కూడా జైలులో పెట్టించడంతో రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనస్ లో పడింది. తెలుగుదేశం పార్టీ తమకు కలిసి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఫలితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

ఇప్పుడు కూటమి (తెలుగుదేశం, జనసేన, బిజెపి) ప్రభుత్వం అధికారంలో ఉంది. స్వచ్ఛమైన పాలనతో పాటు నిజాయితీగా పనిచేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు… అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉండడంతో కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ప్రజల్లో సన్నగిల్లుతున్నాయి . కూటమి ప్రభుత్వం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటిదేనన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం పాటు బాగానే ఉంది. అసలు కథ అప్పుడు మొదలైంది. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నాయకుల మధ్య ఆదిపత్య పోరు రగిలింది. ఎన్నికల సమయంలో కూటమి అధికారంలోకి రావడం కోసం తాము ప్రచారాల్లో పాల్గొనడంతో పాటు లక్షల్లో ఖర్చు చేశామని, తమకు కచ్చితంగా న్యాయం జరగాలన్న పట్టుదలతో కూటమి నాయకులు, కార్యకర్తలూ ఉన్నారు. అందుకు ఉదాహరణగా కృష్ణాజిల్లానే తీసుకుంటే జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది..

ఇసుక, బుసకను అనుమతులు లేకుండానే అవినీతి మార్గాన నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాల్లో తవ్వి వందలాది ట్రాక్టర్లతో అమ్మేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో తెలుగుదేశం, జనసేన నియోజకవర్గ, మండల స్థాయి నాయకుల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాటాల పంపకంలో తేడాలు రావడంతో నీ కంటే నాకు పార్టీలో పలుకుబడి ఎక్కువ ఉంది. కాదు నాకే ఉందన్న అహంభావంతో ఎవరికి వారు వ్యవహరిస్తూ ఉండటంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ విభేదాలు గ్రామాల్లో కూడా చేరుకున్నాయి.

నియోజక వర్గంలో ఇంత భారీ ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతున్నా… ఆయా నియోజకవర్గ శాసనసభ్యులు ఏమీ జరగనట్లు వ్యవహరించడం ప్రజల్లో ఆశ్చర్యం కలిగిస్తుంది.

శాసనసభ్యులకు తెలియకుండా ఉంటుందా..?

జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలైన అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, పామర్రు, గుడివాడ, పెనమలూరు, గన్నవరంలలో ముఖ్యంగా అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, పామర్రు, గుడివాడలలో ఎక్కువగా అక్రమంగా మట్టి తరలింపులు జరుగుతున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి గురించి మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు శాసనసభ్యులకు తెలియకుండా ఉంటుందా? అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. సాధారణంగా నియోజకవర్గాల్లో ఏ చిన్నపాటి విషయం జరిగిన తక్షణమే శాసనసభ్యులకు తెలిసిపోతుంది. ఏ సంఘటన జరిగిన ఆ సంఘటన వెనుక ఎవరు ఉన్నారు అన్నది కూడా ఇట్టే తెలిసిపోతుంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు లేదా తమ అనుయాయులు ఆ సంఘటనలో ఉన్నారని తెలిస్తే పోలీస్ కేసులు ఒకరకంగా, ప్రతిపక్షం వారు ఉన్నట్లయితే కేసు మరోరకంగా ఉంటుంది.

ఇప్పుడు మట్టి మాఫియా పై ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే శాసనసభ్యులు కట్టడి చేయకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకంటే అవినీతి చేసే వారంతా ఎక్కువ భాగం అధికార పార్టీకి చెందిన వారే గనుక.

ఎందుకు చర్యలు తీసుకోరంటే

ఎన్నికల సమయంలో అనేకమంది కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయడమే కాకుండా పలువురు డబ్బు కూడా వ్యయం చేశారు. ఖర్చు చేసిన డబ్బు రాబట్టుకోవడం కోసం అటువంటి వారికి కొన్ని తప్పుడు పనులు చేయక తప్పడం లేదు. ఈ విషయాలు శాసనసభ్యులకు తెలుసు. అటువంటి వారిపై కేసులు పెట్టలేరు. ఎందుకంటే తమ పార్టీకి చెందిన వారు దూరం అవ్వడం ఇష్టం ఉండదు. రాబోయే ఎన్నికలకు మళ్లీ వారి సహాయం ఖచ్చితంగా కావాలి గనుక.

అధికారుల పాత్ర

నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ విధంగా అవినీతి జరుగుతుందో, ఎవరి ప్రమేయం ఉంటుందో అన్ని వివరాలు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులకు తెలుసు. ఒకవేళ దాడులు చేసి పట్టుకుందామంటే అందుకు శాసనసభ్యులు అడ్డుపడతారు. శాసనసభ్యులకు తెలియజేయకుండా దాడులు చేయలేరు. ఒకవేళ చేసినా ఏం జరుగుతుందో అధికారులకు తెలుసు. ఇతర జిల్లాలకు బదిలీలు జరుగుతాయి. లేదా ప్రాధాన్యత లేని శాఖలకు వెళ్ళవలసి ఉంటుంది. అందుకే అధికారులు జోక్యం చేసుకోరు. శాసనసభ్యుల కనుసన్నలోనే అధికారులు ఎప్పుడూ ఉంటారు.

పార్టీలో అధినేతలు జోక్యం చేసుకోవాలి

కృష్ణాజిల్లాలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ పార్టీల్లో ఏమి జరుగుతోంది? ఎందుకిలా జరుగుతోందన్న విషయాలపై కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పటికే తెలుగుదేశం జనసేన విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్ళాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ విభేదాల ప్రభావం తప్పకుండా ఉంటుంది. కూటమికి బీటలు పడతాయి. అందువల్ల ముందుగా అక్రమ ఇసుక రవాణా, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అరికట్టాలి. శాసనసభ్యులు తమ బాధ్యతలను స్వలాభం కోసం కాక కూటమి పటిష్టత కోసం అందరూ కలిసి పనిచేస్తేనే ఫలితాలు ఉంటాయి.. లేకపోతే ఇంతే సంగతులు…!

నందం రామారావు
మచిలీపట్నం

About Author

SSN