MachilipatnamLocal News
May 24, 2026
జిల్లా

కేంద్ర ప్రభుత్వ పథకాలను సజావుగా అమలు చెయ్యాలి….ఎంపీ బాలశౌరి

  • May 23, 2026
  • 0 min read
[addtoany]
కేంద్ర ప్రభుత్వ పథకాలను సజావుగా అమలు చెయ్యాలి….ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం:

జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సజావుగా అమలు చేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరూ తోడ్పాటు అందించాలని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అధికారులకు సూచించారు. శనివారం ఉదయం మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డీ.కే.బాలాజీ, అవనిగడ్డ, గుడివాడ, పెడన శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ , వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్ లతో కలిసి దిశా సమావేశం నిర్వహించి పలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని సమీపించారు.

వారు ముఖ్యంగా ఉపాధి హామీ,దివ్యాంగుల సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా,గృహ నిర్మాణం వ్యవసాయం, బ్యాంకు పంట రుణాలు, జలవనరులు, వైద్య ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి,, రహదారులు భవనాలు, జాతీయ రహదారులు, పరిశ్రమలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిపారు.

ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారి జీవనోపాదుల పెంపొందించడానికి సహకారం అందించాలన్నారు. పీఎంఈజీపి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 100 మంది మహిళలకు గొర్రెలు, గేదెలు, నాటు కోళ్లు పారాలు, పడవల తయారీకి ,ఓడరేవు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుక 500 కోట్ల రూపాయల మేరకు రుణాలు మంజూరు చేయాలన్నారు. తద్వారా వారు జీవన ప్రమాణాలు పెంపొందించుకోగలుగుతారన్నారు. వీటన్నిటికీ మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం జిల్లాలో 800 మంది లబ్ధిదారులను మొదట గుర్తించాలన్నారు

ముఖ్యంగా ఇందుకోసం జిఎం డిఐసి బ్యాంకర్లతో కలుపుకొని వాట్సప్ గ్రూప్ సిద్ధం చేసుకుని గ్రామాల్లో ఔట్రీచ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పుట్టగొడుగులు, ఆభరణాల చేపలు, పీతల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించి మహిళలకు శిక్షణ కూడా ఇప్పించే ఏర్పాటు చేయాలన్నారు. డి ఆర్ డి ఏ ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున జీవనోపాదులకు ఆర్థిక సహాయం అందించి మహిళ వ్యాపారవేత్తలను తయారు చేయాలన్నారు. జిల్లాలో అవసరమైన స్మశాన వాటికల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయిస్తామని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ఏమైనా ఉంటే వెంటనే పంపాలన్నారు. గ్రామాల్లో డొంక రోడ్లకు చాలా ప్రాధాన్యం ఇవ్వాలని మండలానికి, మండలానికి కనీసం రెండు చొప్పున అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామస్తులతో మాట్లాడి సాంకేతిక పరంగా ఆలోచించాలన్నారు

జిల్లాలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు వారికి కావలసిన పరికరాలు ఏమిటో ఏ ఏ పరికరాలు కావాలో వాటి వివరాలు సిద్ధం చేయాలని ఇందుకోసం నిధులు కూడా అందుబాటులో ఉన్నాయనీ అధికారులకు సూచించారు. ఈ వేసవిలో తీర ప్రాంత ప్రజలకు మంచినీటి సమస్యలు ఉన్నాయని వాటిని తీర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో మంచినీటి పథకాలు సజావుగా పనిచేసేలా చూడాలన్నారు. ప్రకాశం బ్యారేజీ నుండి 5,900 కోట్ల రూపాయల వ్యయంతో మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయడం జరిగిందని, అందులో కేంద్ర ప్రభుత్వం 50 శాతం కింద, మిగిలినది రాష్ట్ర ప్రభుత్వము భరించాల్సి ఉందన్నారు. ఈ విషయమై ప్రజాప్రతినిధులను వెంటబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రినీ కలిసి వివరిస్తామన్నారు.
జిల్లాలో 60 వేల మంది కౌలు రైతులకు గాను 30 వేల మందికి మాత్రమే ఇప్పుటి వరకు సిసిఆర్సి కార్డులు ఇచ్చారని , అందులో అర్హులైన 10 వేల మందికి మాత్రమే ఇప్పటివరకు బ్యాంకు పంట రుణాలు ఇచ్చారన్నారు. మిగిలిన కౌలు రైతులకు కూడా పంట రుణాలు మంజూరు చేసి వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడాలన్నారు

పామర్రు చల్లపల్లి రహదారిని నిర్మించాలని, గుడివాడ చల్లపల్లి కొత్తపాలెం రహదారిని నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ రెండు లేదా మూడు రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. బందరు ఓడరేవు కలుపుతూ రహదారి నిర్మాణానికి ఏర్పాటులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మచిలీపట్నం… విజయవాడ రహదారిని 6 వరుసల రహదారి నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలన్నారు. గుడివాడలో పై వంతెన పనులు 34 కోట్లతో చేపట్టిన రహదారుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్ని మునిసిపాలిటీలలో అమృత్ పథకం కింద మంజూరైన నిధులను త్రాగునీరు, మురికి నీటి వ్యవస్థ మెరుగుపరుచుటకు సద్వినియోగం చేసుకోవాలన్నారు

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ మనుషులకు ఆధార్ కార్డు ఎలాగో ఆ విధంగా పశువులకు కూడా గోదార్ ఏర్పాటు చేసి గేదలు రొటేషన్ కాకుండా బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలన్నారు లబ్ధిదారులకు, బ్యాంకర్లందరికి ఒకేసారి గేదెలు లబ్ధిదారులు కనపడేలా చూసుకోవాలన్నారు. జిల్లాలో పుట్టగొడుగుల పెంపకం, ఆభరణ చేపల, పీతల పెంపకం పై కూడా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో ఎవరైనా మహిళలు ముందుకు వస్తే వారి జీవనోపాదులు పెంపుదలకు పీఎంఈజీపి కింద లక్ష రూపాయలు నుండి 5 లక్షల రూపాయల వరకు రుణాలు అందించే ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఇకపై ఏ సమావేశంగాని కార్యక్రమం జరిగిన జిల్లా అధికారులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తప్పనిసరిగా ఫ్లెక్సీ బ్యానర్లకు బదులుగా గుడ్డ బ్యానర్లను వినియోగించాలన్నారు.
గ్రామాల్లో ప్రజలు భూగర్భ జలాశయాలు వద్దని( జి ఎల్ ఎస్ ఆర్) భూ ఉపరితల జలాశయాలు( ఓహెచ్ఎస్ఆర్ లు) కావాలంటున్నారన్నారు.

కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు ఇవ్వాలంటే కౌలుకిచ్చిన భూ యజమాని ఒప్పుకొని సంతకం చేయాల్సి ఉందన్నారు. కొంతమంది అందుకు సమ్మతిస్తున్నారని, కొంతమంది ఒప్పుకోవడం లేదని కలెక్టర్ చెప్పారు. కొంతమంది భూ యజమానులు ముందుగానే బ్యాంకు రుణాలు తీసుకోవడంతో మరల కౌలు రైతులకు పంట రుణాలు రావడం లేదన్నారు.

గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ ప్రాంతంలో ఇళ్ళకు సరైనదారులు తదితర వసతులు సరిగా లేవని వాటిని సమకూర్చాలని కోరారు. వడ్లమన్నాడు మురికి కాలువలో పూడిక వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో కాలువలు పొంగి పంట పొలాలు దెబ్బతింటాయన్నారు. గుడివాడ… కంకిపాడు రహదారి చాలా రద్దీగా ఉంటుందని ఆ రహదారిని బాగుపరచాలన్నారు.

పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తమ తమ నియోజకవర్గంలో ట్రాక్టర్లు తక్కువ ఇస్తున్నారనీ, ట్రాక్టర్లు కావలసిన రైతులందరికీ మంజూరు చేయాలని కోరారు. తుమ్మిడివద్ద అధికంగా ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని ప్రమాదాల నివారణకు సరైన ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, జడ్పీ సీఈవో జే అరుణ, డ్వామా, డిఆర్డిఏ పిడి లు శివప్రసాద్ ,హరిహరనాథ్ డిపిఓ ఎం ధనలక్ష్మి, డి టి డబ్ల్యూ ఓ ఫణి ధూర్జటి, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర బాబు, డి ఎం అండ్ హెచ్ ఓ యుగంధర్ ,జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, మత్స్యశాఖ జేడీ అయ్య నాగరాజా, డిపిటీవో వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, డిప్యూటీ జెడ్పిసిఈఓ ఆనంద్ కుమార్ పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, పలువురు బ్యాంకర్లు,తదితర జిల్లా అధికారులు అనధికారులు పాల్గొన్నారు

About Author

SSN