MachilipatnamLocal News
April 9, 2026
స్పెషల్ స్టోరీ

జగన్మోహనావతారమెత్తిన మూడు నగరాల మాలిక “మావిగన్”!?

  • April 5, 2026
  • 1 min read
[addtoany]
జగన్మోహనావతారమెత్తిన మూడు నగరాల మాలిక “మావిగన్”!?

“బాహ్య చక్షువులతో చూడలేని, కేవలం గ్రాఫిక్స్ లో మాత్రమే చూడగలిగే అమరావతి  రెండు లక్షల కోట్ల నిధుల (ప్రస్తుత లెక్కల ప్రకారం) అంచనాతో ఊహాలోకంలో విహరింప చేస్తుంటే, కేవలం ఇరవై వేల కోట్ల అంచనాతో జగన్మోహనా వతారమెత్తిన మూడు నగరాల మాలిక మావిగన్” ఆంధ్ర రాజకీయాలను రసకందాయంలో పడవేసింది.

 
          తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశమైన పదం “మావిగన్”. ఎందుకంటే ఏమాత్రం మొహమాటం లేకుండా, తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా, ఆచరణ సాధ్యమయ్యేలా మాట్లాడగలిగే నేత యెండూరి సందిటి జగన్ మోహన్ రెడ్డి నోటి నుండి వచ్చిన పదం మావిగన్!
         కరోనా సమయంలో జగన్ మాటలు గుర్తున్న వారెవరైనా జగన్ ముక్కుసూటి తనాన్ని అంగీకరించాల్సిందే. రానున్న రోజుల్లో కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని ముఖ్యమంత్రి హోదాలో జగన్ చెప్పిన మాటలు అత్యంత వివాదాస్పద మైనప్పటికీ తర్వాతి కాలంలో జగన్ చెప్పిన మాటని అందరూ అయాచితంగానే అంగీకరించాల్సి వచ్చింది. ప్రభుత్వ సేవలను మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తాను అని ప్రకటించినప్పుడు వికటాట్టహాసం చేసిన వారు, అదే వ్యవస్థను అంగీకరించలేక, తిరస్కరించలేక నానా తిప్పలు పడ్డారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ను ప్రతిపాదించి, పారిశ్రామికవేత్తలతో సమావేశాలను వైజాగ్ లో నిర్వహించినపుడు వేలెత్తి చూపిన నాయకులు…. నేడు విశాఖపట్నం రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని ప్రకటించక తప్పలేదు.
       అన్ని గన్ లు పేలకపోవచ్చు …కానీ జ’గన్’ నోటి నుండి వచ్చిన మాట ఖచ్చితంగా పేలుతుందని 2019 ఎన్నికలలో తాను ప్రకటించిన మ్యానిఫెస్టోను దాదాపుగా అమలుచేసి తన నైజాన్ని జగన్ ఆంధ్రరాష్ట్రానికి చాటాడు.  రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ కు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కు వచ్చిన స్పందన చూసిన వారెవరికైనా జ’గన్’ పేలే గన్ ఆఁ లేక ఏఐ గన్ ఆఁ అన్నది అర్ధమవుతుంది! 
         ఇలాంటి ప్రాక్టికల్ నాయకుడు జగన్ అమరావతి పై మాట్లాడుతూ… “అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు” అనీ అందుకే మా హయాంలో మేము విశాఖపట్నం ను రాజధాని గా మార్చాలని ఆలోచన చేశామని చెబుతూ, ఆ ప్రతిపాదన మీకు నచ్చలేదు కాబట్టి ప్లాన్ బి గా దీనిని పరిశీలించండి అంటూ రాష్ట్ర ప్రజల ముందు కొత్త ఆలోచనకు తెరతీశారు.
        ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెరపైకి తెచ్చిన రాజకీయ ప్రతిపాదన “మావిగన్” (MAVIGUN). ఇది రాష్ట్ర రాజధాని, అభివృద్ధికి సంబంధించి జగన్ కొత్త వ్యూహం. మావిగన్ అంటే అది ఇంగ్లీష్ పదమో, హిందీ పదమో లేక లాటిన్, గ్రీకు పదమో కాదు! “మావిగన్” అనేది మూడు కీలక నగరాల పేర్ల కలయికతో ఏర్పడిన ఒక క్యాపిటల్ కారిడార్ ప్రతిపాదన.
 
 మా (MA) – మచిలీపట్నం
 వి (VI) – విజయవాడ 
 గన్ (GUN) – గుంటూరు
 
         మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడు నగరాలను కలుపుతూ సుమారు 110 కిలోమీటర్ల పరిధిలో ఒక “మెగా రాజధాని కారిడార్‌”ను అభివృద్ధి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఈ ప్రతిపాదన లోని ప్రధాన అంశం …. ఒకే నగరంపై భారం వేయకుండా, ఈ మూడు నగరాల బలాలను కలిపి ఒక ఆర్థిక, పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దడం.
 
మచిలీపట్నం – పోర్ట్, ఎగుమతులు, పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయడం.
విజయవాడ – రవాణా, కనెక్టివిటీ, పరిపాలనా కేంద్రంగా ఉపయోగించుకోవడం.
గుంటూరు – విద్యా, వైద్యం, న్యాయ సంబంధిత సంస్థల కేంద్రంగా తయారు చేయడం.
 
         అమరావతిలో లక్షల కోట్లతో భారీగా నిర్మాణాలు చేపట్టడం కంటే, ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ కేవలం రూ. 20 వేల కోట్లతో ఈ కారిడార్‌ను అభివృద్ధి చేయవచ్చని వైఎస్సార్సీపీ నాయకులు వాదిస్తున్నారు. ఇది భవిష్యత్ తరాల కోసం చేపట్టిన ఒక వ్యూహాత్మక ఆలోచన అని, ఇది రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుందని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. 
        కాదు కాదు ఇది అమరావతి నిర్మాణానికి అడ్డంకులు సృష్టించేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు తెచ్చిన మరో కొత్త “డ్రామా” అని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. గతంలో “మూడు రాజధానుల” పేరుతో కాలక్షేపం చేశారని, ఇప్పుడు మళ్ళీ కొత్త పేరుతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
         ఇలా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ “మావిగన్” ప్రతిపాదనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
           క్లిష్ట పరిస్థితులలో జగన్ మొండిగా ముందుకు వెళతాడు అనేది జగన్ శత్రువులు సైతం ఒప్పుకునే అంశం. ఒక వేళ 2029లో గనుక వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మావిగన్ కార్యరూపంలోకి వస్తుందని ప్రస్తుత పరిణామాలు స్పష్టత నిస్తున్నాయి. దాంతో అమరావతి రియల్ ఎస్టేట్ తప్పనిసరి పరిస్థితులలో నెమ్మదిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని అంటూనే, అమరావతి అభివృద్ధికి 2లక్షల కోట్లు అవసరం అవుతుందని చెబుతూ ఉండటం అయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. మహా నగరాలలో సైతం చదరపు అడుగు నాలుగు వేల రూపాయలతో నిర్మాణం జరుగుతుంటే, అమరావతి నిర్మాణాలకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలకు టెండర్లు ఖరారవ్వటం రాష్ట్ర ప్రజలకు పలు సందేహాలు కలిగిస్తున్నాయి. 
          జగన్ ప్రతిపాదిత మావిగన్ లోని మచిలీపట్నం దేశంలోనే రెండవ అతి పురాతన మున్సిపాలిటీ కాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి మున్సిపాలిటీ. పంతొమ్మిదవ శతాబ్దంలో వాణిజ్య పరంగా వెలుగొందిన మచిలీపట్నం ఓడరేవు, జగన్ మావిగన్ ప్రతిపాదనతో పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుందా అనే ఆశలు మచిలీపట్నం నగర ప్రజలలో రేకెత్తుతున్నాయి. 2023, మే 22న మచిలీపట్నం పోర్టు పనులకు శంఖుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి, 2026 కల్లా మచిలీపట్నం పోర్టు వినియోగంలోకి వస్తుందని ప్రకటించారు. ప్రణాళికకు అనుగుణంగా 2024 ఏప్రిల్ నాటికే దాదాపు ఎనభై శాతం పోర్టు పనులు పూర్తి చేయగలిగారు. 
 
       “బాహ్య చక్షువులతో చూడలేని, కేవలం గ్రాఫిక్స్ లో మాత్రమే చూడగలిగే అమరావతి  రెండు లక్షల కోట్ల నిధుల (ప్రస్తుత లెక్కల ప్రకారం) అంచనాతో ఊహాలోకంలో విహరింప చేస్తుంటే,  కేవలం ఇరవై వేల కోట్ల అంచనాతో జగన్మోహనావతారమెత్తిన మూడు నగరాల మాలిక మావిగన్”  ఆంధ్ర రాజకీయాలను రసకందాయంలో పడవేసింది.
 
        అమరావతి – మావిగన్ లపై ఆంధ్రప్రదేశ్ లోని మేధావులు, సామజికవేత్తలు, ఆర్థికవేత్తలు, ఉన్నతాధికారులు, వివిధ వర్గాల మధ్య  విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు కి నచ్చింది కాబట్టి అమరావతి అనీ, జగన్ ప్రతిపాదించాడు కాబట్టి మావిగన్ అని కాకుండా  అధికార – ప్రతిపక్ష నేతలు సైతం వారి వారి పార్టీల ఎజెండాలను, ఇగోలను పక్కన పెట్టి లోతైన కోణంలో  అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం దిశగా అడుగులు వేయాలి. ఈ రకమైన చర్చ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యావశ్యకం కూడా.
 
శ్యామ్ కాగిత 
మచిలీపట్నం 
 

 

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *