MachilipatnamLocal News
April 15, 2026
జిల్లా

మహిళా సాధికారతకు జిల్లా పరిషత్ కొత్త దిశ

  • April 9, 2026
  • 0 min read
[addtoany]
మహిళా సాధికారతకు జిల్లా పరిషత్ కొత్త దిశ
జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కుమార్ తో కలిసి నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక
 
మచిలీపట్నం: 
 
మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారత లక్ష్యంగా కృష్ణా జిల్లా పరిషత్ నూతన షాపింగ్ కాంప్లెక్స్‌ ద్వారా మహిళలకు వ్యాపారావకాశాలతో పాటు జిల్లా పరిషత్‌కు ఆదాయ వనరు కలగనుందని జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు.
గురువారం ఉదయం కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మచిలీపట్నం నగరంలోని జిల్లా పరిషత్ ముంగిట నూతనంగా నిర్మించిన దుకాణాల సముదాయాన్ని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కుమార్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ, మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని సుమారు రెండేళ్ల క్రితం ఈ భవనానికి మహిళా సాధికారత భవనంగా శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. మహిళలు చిన్న స్థాయి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఈ దుకాణాలను వారికి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
 
మచిలీపట్నంలో 10 దుకాణాలు, అవనిగడ్డలో 12 దుకాణాలు మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం కోసం సిద్ధం చేయబడ్డాయని, వీటి ద్వారా మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు, సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
 
దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. త్వరలోనే పత్రికా ప్రకటన విడుదల చేసి, ఓపెన్ టెండర్ విధానం ద్వారా అర్హులైన వారికి దుకాణాలను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఒకవైపు మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభించగా, మరోవైపు జిల్లా పరిషత్‌కు అదనపు ఆదాయం సమకూరుతుందని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టు సామాజిక, ఆర్థిక పరంగా ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సాకారం కావడానికి కృషి చేసిన జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది సంబంధిత శాఖలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 
కార్యక్రమంలో జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణరావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *