MachilipatnamLocal News
September 20, 2026
జిల్లా

గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రత తప్పనిసరి: ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి

  • September 8, 2026
  • 1 min read
గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రత తప్పనిసరి: ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి

విజయవాడ:

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ మధ్య మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి. పుల్లారెడ్డి పిలుపునిచ్చారు. “భక్తితో పూజిద్దాం.. భద్రతతో పండుగ జరుపుకుందాం” అనే నినాదంతో పండుగను సురక్షితంగా జరుపుకోవాలని కోరారు. మండపాల్లో విద్యుత్‌ అలంకరణలు, తాత్కాలిక విద్యుత్‌ వినియోగం విషయంలో నిర్వాహకులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.

ఉత్సవాల సందర్భంగా ఈ నెల 26వ తేదీ వరకు గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నట్లు సీఎండీ తెలిపారు. దరఖాస్తు రుసుమును రూ. 100గా నిర్ణయించామని, 500 వాట్ల వినియోగానికి రూ. 1,000 అలాగే 1,000 వాట్ల వినియోగానికి రూ. 2,250 చొప్పున తాత్కాలిక రుసుము ఉంటుందని వెల్లడించారు. తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కోసం నిర్వాహకులు స్వర్ణ గ్రామ లేదా వార్డు సచివాలయాలు, మీ-సేవ కేంద్రాలు లేదా ఏపీసీపీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ (apcpdcl.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

విద్యుత్ ప్రమాదాల నివారణకు మండపాల నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మండపాలను విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఏర్పాటు చేయాలని, నాణ్యమైన వైర్లు మరియు స్విచ్‌లను మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. విద్యుత్ వైరింగ్ పనులను అనుభవజ్ఞులైన ఎలక్ట్రీషియన్లతోనే చేయించాలని, వర్షాల సమయంలో పరికరాలు తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగలు తెగిపడినా లేదా ప్రమాదకరంగా ఉన్నా వెంటనే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

అనధికారికంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం లేదా అక్రమంగా విద్యుత్‌ను వినియోగించడం తీవ్రమైన నేరమని సీఎండీ హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా రాకపోకలకు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మండపాల వద్ద తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.

About Author

SSN