MachilipatnamLocal News
September 5, 2026
పోలీస్ & లీగల్ డైరీ

వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా వైజెఆర్ డిఎంఎస్ కళాశాలలో డిఎల్ఎస్ఏ అవగాహన సదస్సు

  • June 6, 2026
  • 1 min read
వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా  వైజెఆర్ డిఎంఎస్  కళాశాలలో డిఎల్ఎస్ఏ అవగాహన సదస్సు

మచిలీపట్నం:

విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, వాటి వల్ల కేసులలో ఇరుక్కుని మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహమతుల్లా విద్యార్థులకు ఉద్బోధించారు. స్థానిక వైజెఆర్ డిఎంఎస్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిఎల్ఎస్ఏ ) ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ప్రాముఖ్యత, పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల గుర్తింపు – చైతన్యం అనే అంశంతో పాటు, సైబర్ క్రైమ్ చట్టాలపై విస్తృత అవగాహన కల్పించారు.

సదస్సుకు ముఖ్య అతిథి గా హాజరైన న్యాయమూర్తి రహమతుల్లా మాట్లాడుతూ జెన్ జి తరానికి చెందిన మీరు తల్లిదండ్రులతో స్నేహంగా మెలుగుతూ వృద్ధిలోకి రావాలని హితవు పలికారు. సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న బాలల హక్కుల ఉల్లంఘన, పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. బాధితులకు చట్టపరంగా లభించే రక్షణ, న్యాయ సహాయం గురించి విద్యార్థులందరూ అవగాహన కలిగి ఉండాలి. చట్టాల పట్ల అవగాహనతోనే ఇటువంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించగలం అని ఆయన స్పష్టం చేశారు. ​ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో రూపొందిన చైతన్యం పోస్టర్లను న్యాయమూర్తి ఆవిష్కరించారు.

ఆహార వృధాను అరికట్టడం, పౌష్టికాహార విలువలను తెలుసుకోవడం యువత బాధ్యత అని సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు పేర్కొన్నారు. శుభ్రతతో కూడిన ఆహారాన్ని స్వీకరించటం ద్వారా విద్యార్థులలో శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక దారుఢ్యానికి తోడ్పడుతుందని, విద్యార్థులలో మానసిక ఆరోగ్యంతో పాటు, యోగా సాధన పట్ల అవగాహన పెంచుకోవటంతో ఏకాగ్రతతో పాటు చదువు పట్ల శ్రద్ధ వహించగలుగుతారన్నారు.

ఈ సదస్సులో ఎల్ ఏ డి సి న్యాయవాదులు మాటూరి మణికంఠ, సోగన క్రాంతి శ్రీ, ఎల్ ఏ డి సి మాజీ చీఫ్ న్యాయవాది ముసలయ్య, బందరు తాలూకా ఎస్సై రమేష్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. నాగ జ్యోతి, ఎన్ఎస్ఎస్ ప్రతినిధి అబ్దుల్ నబి, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థినులు పాల్గొన్నారు.

About Author

SSN