“చీకటి వెనక వెలుగు” పుస్తకావిష్కరణ, నాటక ప్రదర్శన
మచిలీపట్నం:
భావ తరంగిణి సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు భవిష్య రాసిన “చీకటి వెనుక వెలుగు ” సందేశాత్మక నాటక పుస్తక ఆవిష్కరణ స్థానిక మహతి ఆడిటోరియంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. అనంతరం అదే నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ ఇటీవల సాంఘిక నాటకాల పట్ల ప్రేక్షక ఆదరణ పెరిగింది అన్నారు. ఈనాడు మన సంప్రదాయ కళలు ప్రపంచవ్యాప్తమై విలాజిల్లుతున్నాయన్నారు. ఇటీవల భవిష్య పలు సందేశాత్మక నాటకాలు రాసి ప్రదర్శించటం అభినందనీయమన్నారు.
ప్రపంచ తెలుగు రచయితల సంఘ అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభలో త్యాగరాజ సంగీత విద్యాపీఠం అధ్యక్షులు బి హెచ్ వి ఎల్ రాధాకృష్ణమూర్తి నాటక పుస్తకాన్ని ఆవిష్కరించగా సాహితీ మిత్రుల అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ తొలి ప్రతిని స్వీకరించారు. సాహితీవేత్త డాక్టర్ బి .ధన్వంతరి ఆచార్య గౌరవ అతిథిగా, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ డిప్యూటీ చీఫ్ మేనేజర్ టి .పెద్దిరాజు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రసంగించారు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (ఉయ్యూరు)డిప్యూటీ మేనేజర్ కేశన మనో సత్య నందిని జ్యోతి ప్రకాశం చేయగా, గాయని విజయలక్ష్మి ప్రార్థనాగీతం ఆలపించారు. కే శిరీష సభకు స్వాగతం పలికారు.
అనంతరం భవిష్య రచన, దర్శకత్వంలో రూపొందిన చీకటి వెనుక వెలుగు నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలో ఆర్టీసీ అధికారి పెద్దిరాజు ఒక పాటకు నేపథ్యగానం అందించటం, అలాగే 91 సంవత్సరాల వయస్సు గల పోతిరెడ్డి విఠల గౌరీశ్వరి ప్రత్యేక పాత్రలో నీతిగా ప్రశాంతంగా, సంతృప్తికరంగా జీవించాలని తెలిపే పద్యాలు ఆలపిస్తూ అభినయించటం విశేషం.
“అర్థం లేని ఆరాటం అంతులేని పరుగు వీటి మధ్య మనిషి కోల్పోతున్న మనశ్శాంతిని తట్టి లేపే అంశం” తో కూడిన ఈ
నాటకంలో ఔత్సాహిక కళాకారులు రావినూతల సత్యనారాయణ , భవిష్య, డి.దత్తాత్రేయ శర్మ, వై శ్రీరామ్, అద్దేపల్లి మల్లికార్జున ప్రసాద్, ఆర్ వెంకటేశ్వర్రావు, కోసూరు ఈశ్వరరావు, పి.శాంతి లు పాత్రలకు తగ్గట్టుగా అభినయించి నాటకాన్ని రక్తి కట్టించారు.

