బొల్ల హాసిని మచిలీపట్నం ఫస్ట్
మచిలీపట్నం:
కృష్ణాజిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న టి. వరమ్మ కుమార్తె బొల్ల హాసిని గురువారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో అసాధారణ ప్రతిభ కనబరిచి 600కి గాను 597 మార్కులు సాధించింది. ఆమె సాధించిన ఈ అద్భుత ఫలితంతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్, కృష్ణా జిల్లాలో 2వ ర్యాంక్, అలాగే మచిలీపట్నంలో 1వ ర్యాంక్‌ను అందుకుని ప్రతిభను చాటింది.
ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు బొల్ల హాసిని ని ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి చదివి ఇంత ఉన్నతమైన ఫలితాలు సాధించడం ఆమె పట్టుదల, క్రమశిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగ బాధ్యతల మధ్య కూడా తన కుమార్తెకు సముచిత మార్గదర్శకత్వం అందించిన కానిస్టేబుల్ టి. వరమ్మను ఆయన అభినందించారు.
ఈ విజయాన్ని కృష్ణా జిల్లా పోలీస్ కుటుంబం మొత్తం గర్వంగా భావిస్తున్నదని, పోలీస్ సిబ్బంది పిల్లలు అన్ని రంగాలలో కూడా ముందంజలో నిలవాలని, విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. బొల్ల హాసిని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆశిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

