MachilipatnamLocal News
September 20, 2026
స్పెషల్ స్టోరీ

భేతాళ ప్రశ్న???????

  • September 12, 2026
  • 1 min read
భేతాళ ప్రశ్న???????

సంబరాల సూరీడు….

విక్రమార్కుడు మౌనంగా స్మశానం లో చెట్టు ఫై నుంచి భేతాళుడిని తీసుకొని తన భుజంపై వేసుకొని నడవ సాగాడు.  ఇంతలో యథావిధిగా భేతాళుడు… విక్రమార్కునికి కథ చెప్పటం ప్రారంభించాడు.

రాజా! అనగనగా ఒక ఊరిలో సూరీడు అనే తెలివైన నాయకుడు ఉన్నాడు. అతను అధికారంలోకి రావడానికి అనేకానేక అలవి కాని వాగ్దానాలు చేసి ప్రజా ప్రతినిధిగా గెలుపొందాడు. నాయకుడిగా హామీలు ఇచ్చిన సూరీడుకు ప్రజా ప్రతినిధిగా గెలిచిన పిమ్మట తాను ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యపడలేదు. తాను ఇచ్చిన హామీల గురించి ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలని తెలివైన సూరీడు ప్రజలని మత్తులో ఉంచాలనుకున్నాడు. మద్యం ధరలు తగ్గించి మద్యపాన ప్రియులకు అందుబాటు ధరలలో మద్యాన్ని తీసుకువచ్చాడు. మద్యం దుకాణాలు విచ్చలవిడిగా తెరవడంతో మద్యపాన ప్రియులు మద్యం సేవించి మైకంలో ఉండేలా చేసాడు. మద్యం కొనుగోలుకు దూరం వెళ్లకుండా ప్రతి సందులోను, గొందులోను మద్యం దొరికేలా చర్యలు చేపట్టి తెలివైన సూరీడు… సంబరాల సూరీడుగా మద్యం సేవించే వారి మన్ననలు పొందాడు.

ఈ లోపు వర్షాకాలం వచ్చింది. కానీ వర్షాలు మాత్రం సాధారణ స్థాయిలో కురవలేదు. దాంతో ఊరికి కరువు వచ్చింది. వర్షాలు లేక కరువు రావడంతో వ్యవసాయం లేక రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఒక వైపు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించలేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 

మద్యపాన ప్రియులను మత్తుగా పడుకోబెట్ట గలిగాడు  కానీ మహిళలు, మద్యం తాగని ప్రజలలో సూరీడు పట్ల వ్యతిరేకత మొదలైంది. దాంతో తెలివైన సూరీడు మిగతా ప్రజలను భక్తి మైకంలో ముంచి బుజ్జగించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా దేవుడి ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు.  ఇక సంబరాల సూరీడు బహిరంగ ప్రకటన చేసాడు.

మన ఊరికి అరిష్టం పట్టింది. అరిష్టాన్ని పోగొట్టడానికి ప్రపంచంలోనే అత్యంత ఘనంగా ఆలయాన్ని నిర్మిస్తున్నాను. ఈ ఆలయ నిర్మాణంతో మన ఊరు అభివృద్ధిలో ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. ఈ ఆలయాన్ని మన ఊరి ప్రజలందరం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్మించుకోవాలి. లేని పక్షంలో మన ఊరికి పట్టిన అరిష్టం తొలగదు. ప్రస్తుతం మనం కరువులో ఉన్నాము కాబట్టి తాత్కాలిక ఆలయాన్ని నిర్మిద్దాం. తదనంతరం శాశ్వత ఆలయాన్ని నిర్మించుకుందాం అని ప్రజలను ఆధ్యాత్మిక మాయలోకి దించాడు.

దాంతో ఆలయ నిర్మాణం జరిగితే మన కష్టాలన్నీ తీరిపోతాయని ఊరి ప్రజలందరూ భావించారు. ఆలయ నిర్మాణం కోసం కొంత మంది వ్యక్తులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు సూరీడు. ఊరి ప్రజలందరూ ప్రతి ఇంటి నుంచి ఇటుక తెచ్చి పేర్చారు. ఊరికి పట్టిన అరిష్టం పోవాలని ఊరిలోని వ్యాపారస్తులు, ఆసాములు, మోతుబరులు, చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా విరాళాలు ఇచ్చారు. విరాళాలు ఏ స్థాయిలో వచ్చాయంటే వర్షాలు లేక కరువు వచ్చిన ఊరిలోకి డబ్బుల వరద వచ్చిందా అనే స్థాయిలో డబ్బుల కుప్ప వచ్చిపడింది. వందలు, వేలు , లక్షలు దాటి డబ్బుల వరద కోట్లకు చేరి ఔరా! అనిపించేలా చేసింది. దాహార్తి తీర్చడానికి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించలేని సూరీడు, భక్తి ముసుగులో ప్రజల వద్ద నుంచి కోట్లు సేకరించాడు.

ప్రజలలో ఎవరైనా గళం విప్పి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే వారిని దేశ ద్రోహులుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా, నాస్తికులుగా ముద్ర వేశాడు. దాంతో ఎవరైనా, ఎక్కడైనా ఈ ప్రతిపాదనను ఖండించాలన్నా సూరీడు తప్పుడు ప్రచారానికి భయపడి ఇంటికే పరిమితమైపోయారు.

సూరీడు ప్రజా ప్రతినిధి కావడంతో అధికారులు ఆలయ పనులలో భాగస్వామ్యమయ్యారు. ఆలయ నిర్మాణానికి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ అధికారులు వారి వారి ప్రభుత్వ విధులను పక్కన పెట్టి మరీ ఆలయ నిర్మాణ పనులు నిరాటంకంగా జరిగేలా పర్యవేక్షించారు. ప్రభుత్వ అధికారులు, సంఘం ప్రతినిధులు ఆలయ నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. ఎంతలా ప్రభుత్వ అధికారులు, సంఘం ప్రతినిధులు కలిసి పనిచేశారంటే ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేక సంఘం కార్యక్రమమా అని అర్ధం కానంతగా! సంఘం కార్యక్రమంలో ప్రభుత్వ అధికారుల చురుకైన పర్యవేక్షణకు… స్మశానంలో ఉన్న సగం కాలిన ఎముకను చేతిలోకి తీసుకుని… బేతాళుడనైన నేనే బుర్ర గోక్కోవలసి వచ్చింది.

మొత్తానికి సంబరాల సూరీడు తన స్వీయ పర్యవేక్షణలో ప్రపంచంలోనే అత్యంత సుందరమైన దేవుడి విగ్రహాన్ని భారీ విరాళాల నడుమ నిర్మించిన  తాత్కాలిక ఆలయంలో ప్రతిష్టించాడు. మన కష్టాలన్నీ తీరిపోతాయని ఊరి ప్రజలందరూ తన్మయత్వంతో తాండవం చేశారు. జై! దేవుడు…జై! జై!దేవుడు…జై!జై!జై! దేవుడు… అని జయ జయ ధ్వానాలు చేశారు.  రోజులు, వారాలు, నెలలు గడిచాయి. ప్రజల జీవన స్థితిలో ఎటువంటి మార్పు లేదు. ప్రజలు ఆలోచనలో పడ్డారు. అదేమిటి మనం చిత్తశుద్ధితోనే ఆలయం నిర్మించాము కదా! ప్రతి ఇంటి నుంచి ఇటుక కూడా ఇచ్చాము కదా! మరి మన కష్టాలు తీరలేదేమిటి అని!

ఇది గ్రహించిన తెలివైన సూరీడు మళ్ళీ బహిరంగ ప్రకటన చేశాడు. మనమందరం ఊరి బాగు కోసం తాత్కాలిక ఆలయం నిర్మించాము  కానీ శాశ్వత ఆలయం విషయం మర్చిపోయాం! కాబట్టి మన కష్టాలు తీరలేదు అని మళ్ళీ అమాయకులైన ప్రజల్ని భ్రమలలో ముంచే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు.

కథ పూర్తి చేసి భేతాళుడు విక్రమార్కుడిని ఇలా ప్రశ్నించాడు:
“రాజా! ఈ కథలో సూరీడు చర్యను నువ్వు ఎలా విశ్లేషిస్తావు?

సూరీడు నాయకుడిగా విఫలమయ్యాడా? లేక సమర్థవంతమైన పరిపాలనా వ్యూహాన్ని అమలు చేశాడా? తీవ్రమైన కరువు మరియు నిధుల కొరత ఉన్న సమయంలో ప్రజలు గొడవలు పడకుండా, వారిని ఐక్యంగా ఉంచడానికి ‘ఆధ్యాత్మిక నమ్మకాన్ని’ ఒక సాధనంగా వాడుకోవడం రాజనీతి కిందకు వస్తుందా? లేక ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే బాధ్యతారాహిత్యం అవుతుందా?

ఇక్కడ అసలు తప్పిదం ఎవరిది? మౌలిక వసతులు కల్పించకుండా ఆలయ నిర్మాణం చేపట్టిన నాయకుడిదా? లేదా తమ సమస్యలకు పరిష్కారం ఆలయ నిర్మాణంలోనే ఉందనగానే, విచ్చలవిడిగా నిధులు కురిపించిన అమాయక ప్రజలదా? ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజా సమస్యలకు కాకుండా, ఆలయ నిర్మాణ పర్యవేక్షణకు మళ్లించడం పరిపాలనా నేరమా? లేక ప్రజాభీష్టానికి విలువ ఇవ్వడమా?

ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల వేయి వక్కలవుతుంది!” అని భేతాళుడు హెచ్చరించాడు.
సమాధానం కోసం ఎదురు చూస్తుండగా… విక్రమార్కుడు ఇలా సమాధానం ఇచ్చాడు:

“భేతాళా! ఒక నాయకుడిగా క్లిష్ట సమయంలో ప్రజలలో ఆశను, ఐక్యతను నింపడం మంచిదే. కానీ, మౌలిక సమస్యలైన తాగునీరు, కరువు పరిష్కారాన్ని పక్కనబెట్టి, కేవలం భావోద్వేగాలను నిరంతరం మత్తుగా మార్చడం రాజనీతి అనిపించుకోదు.

ఇక్కడ తప్పిదం ఇరువైపులా ఉంది. నాయకుడు తన విఫలతను కప్పిపుచ్చుకోవడానికి సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకుంటే, ప్రజలు కూడా తమ ప్రాథమిక హక్కులైన నీరు, ఉపాధిని అడగడం మరచి కేవలం భక్తి భ్రమల్లో మునిగిపోయారు. ప్రజాస్వామ్యంలో లేదా రాజరికంలోనైనా ప్రభుత్వ యంత్రాంగం అనేది ప్రజా సంక్షేమానికి వినియోగపడాలి తప్ప, తాత్కాలిక ఉపశమనం ఇచ్చే భావోద్వేగ కార్యక్రమాలకు కాదు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ప్రజలకు ఇవ్వాలి కానీ, నిరంతరం కొత్త భ్రమల్లో ఉంచడం నాయకత్వ లక్షణం కాదు. “నిజమైన అభివృద్ధి మాత్రమే రాజ్యానికీ, నాయకుడికి శాశ్వత కీర్తిని ఇస్తుంది” అని విక్రమార్కుడు తీర్పు ఇచ్చాడు.

విక్రమార్కుడి మౌనభంగం కావడంతో భేతాళుడు విక్రమార్కుని భుజం మీద నుంచి ఎగిరి మళ్లీ చెట్టు మీదకు చేరాడు.

శ్యామ్ కాగిత
మచిలీపట్నం

About Author

SSN