[addtoany]
మచిలీపట్నం:
బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి మహాత్మ జ్యోతి రావు పూలే ఎంతగానో పాటుపడ్డారని, విద్యతో వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప మహనీయులని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కొనియాడారు.
.
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని శనివారం ఉదయం నగరంలోని పెడన మార్గంలో వలందపాలెం లో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా విచ్చేసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ
సామాన్య కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు జ్యోతిరావుపోలే అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
దాదాపు 200 సంవత్సరాల క్రితం ఒక సామాన్య కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు పూలే అన్నారు. పేదరికంతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో అనేక ఉద్యమాలు చేపట్టారు. ఆయన జీవితం మొత్తం కూడా పోరాటాలతోనే నడిచిందన్నారు. . ఆ పోరాటాల్లో భాగంగా తన భార్యకు విద్య నేర్పించి భారతదేశంలో మొట్టమొదటిసారి మహిళలకి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టిన ఘనత జ్యోతిరావు పూలే గారిదేనన్నారు. పిల్లలు పుడితే వాళ్ల ఉద్యమానికి ఇబ్బంది వస్తుందని పిల్లల్ని కూడా కనకుండా చేసినటువంటి త్యాగం భవిష్యత్ తరాలకు ఆదర్శం అన్నారు. . మహాత్మా గాంధీ గారే మహాత్మా అని జ్యోతిరావు పూలే గారి గురించి మాట్లాడారంటే ఆయన ఎంత మహాత్ముడో అర్థం చేసుకోవచ్చన్నారు. మానవ సేవే మాధవ సేవ’ అంటూ నినదించారన్నారు. . ఒక జాతి పైన వేరొక జాతి పెత్తనం చలాయించినంత కాలం ఆ జాతులు అనగతొక్కబడతాయి అని చెప్పి.. గళం విప్పిన యోధుడు పూలే అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఘనత అన్న ఎన్టీఆర్ గారిదేనన్నారు. బడుగు బలహీన వర్గాల బాగు కోసం కృషి చేశారన్నారు. రాజకీయ రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో అవకాశం ఇచ్చారన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. బీసీల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ ప్రారంభించిన ఘనత టీడీపీదేనన్నారు. బీసీలకు తోడ్పాటు అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారనే లక్ష్యంతో ఆదరణ, స్కిల్ డెవలపెంట్, సబ్ ప్లాన్, కార్పొరేషన్ రుణాలు ప్రారంభించారన్నారు. బీసీల పట్ల దుర్మార్గాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అమరావతిలో పూలే స్మారక భవనాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం అన్నారు. . త్వరలోనే స్మారక భవనం పూర్తి చేస్తామన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త అని, సమాజం బాగుండాలని ఉద్దేశంతో తన సతీమణికి తొలుత విద్య నేర్పి ఉపాధ్యాయురాలు చేసి ఆమె ద్వారా బాలికలు చదువు నేర్చుకోవాలని ప్రోత్సహించారన్నారు.
జీవితంలో మనకు ఎదురయ్యే అనుభవాలు మనకు పాఠాలు నేర్పుతాయని ఆ నేర్పించిన పాఠాలు మన అభివృద్ధితో పా సమాజం అభివృద్ధి చెందాలని భావించే వారే మహాత్ములు అవుతారన్నారు. ఒకసారి ఆయన ఊరేగింపులో పాల్గొన్నప్పుడు ఆ ఊరేగింపు అపవిత్రమైందని తాను పాల్గొనడం వలన అపవిత్రమైనదని తనను అవమానించడం జరుగుతుందన్నారు. ఈ విషయమై ఆయన మనసులో చాలా లోతుగా ఆలోచించి చలించిపోయి ఆ తర్వాత అధ్యయనం చేశారన్నారు. థామస్ పెయిన్ రాసిన మానవ హక్కుల పుస్తకం ఆయన పైన చాలా ప్రభావం చూపిందన్నారు. ప్రతి మనిషికి హక్కులు ఉంటాయని అప్పుడు పూలేకు అర్థమైందన్నారు. ఆ విధంగా హక్కులు ఉంటే వాటిని ఇతరులు హరించకూడదని, అందరికీ అందవలసిన అవకాశాలు ఏ ఒక్కరో తీసుకోవడం సరైనది కాదని ఆయన బలంగా నమ్మారు.
ఆ పుస్తకం చాలా మంది చదివే ఉంటారని, అలాంటి ఆలోచన చాలా మందికి వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చడం కొద్దిమందికే ఉంటుందని, అందులో పూలే అగ్రగన్యులుగా నిలిచారన్నారు. ప్రస్తుతం ఒక సంస్థను నెలకొల్పడం ఎంతో సులభమని అయితే ఆ కాలంలో ఒక సంస్థను నెలకొల్పదానికి చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేదన్నారు. ఆ రోజుల్లో సత్యశోధన సమాజం దేశంలో మొదటిసారిగా నెలకొల్పి విద్య కోసం ఎంతగానో కృషి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.
బాల హత్య ప్రతిబంధక్ సంస్థ అనే మరొక సంస్థను కూడా నెలకొల్పారన్నారు. ప్రతి ఆశయాన్ని కూడా సంస్థ ద్వారా కొనసాగించాలనీ , తన తర్వాత కూడా ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో సంస్థను నెలకొల్పారన్నారు. ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రను కేవలం సమాచారం కోసం తెలుసుకోవడమే కాకుండా వాస్తవంగా వారి నుండి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను అనుసరిస్తూ ముందుకు సాగాలన్నారు.
ఆయన మంచి ఆలోచనతో సంస్థలు నెలకొల్పి ఎంత గొప్పవారయ్యారో ఆ విధంగా సమాజంలో అవకాశం వచ్చినప్పుడు గానీ లేదా అవకాశం సృష్టించుకోనైనా పోరాటం చేయాలన్నారు.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ
మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ఎంతగానో సేవ చేశారన్నారు.
సమాజంలో బడుగు బలహీనవర్గాల ప్రజలకు అందరితో సమానంగా గౌరవం దక్కాలని ఆలోచించారని, విద్య ద్వారానే అది సాధ్యమవుతుందని గుర్తించి వారిని విద్యావంతులు చేసేందుకు కృషి చేశారన్నారు.
ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే కు విద్య నేర్పి ఆమె ద్వారా మహిళలందరినీ విద్యావంతులు చేయాలని, పురుషులతో సమానంగా వారు కూడా సమాజంలో ఎదగాలని, దేశంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేశారన్నారు.
అంతేకాకుండా పగలంతా పనిచేసే శ్రామికుల కోసం రాత్రిపూట కూడా తరగతులు నిర్వహించి వారిని విద్యావంతులు చేశారన్నారు. విద్య ద్వారా అసమానతలు తొలగిపోతాయని సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మి అందుకోసం కృషి చేశారన్నారు. ఆయన తన జీవిత కాలమంతా విద్యాభివృద్ధి కోసం శ్రమించారన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రజలు ఆయనను మహాత్మా అని గౌరవంతో పిలిచారన్నారు. 200 సంవత్సరాలు దాటిన ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ బీసీ సామాజిక వర్గాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమం సాధికారత అధికారి జి రమేష్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, పలువురు సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

