ఆగస్టు 15లోపు పంట బీమా నమోదు చేసుకోండి
మచిలీపట్నం మండలంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై అవగాహన సదస్సులు
వ్యవసాయ శాఖ, టాటా ఏఐజి ఇన్సూరెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఖరీఫ్–2026
మచిలీపట్నం:
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్ బి వై)పై గురువారం మచిలీపట్నం మండలంలోని రెండు రైతు సేవా కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమాల్లో టాటా ఏఐజి ఇన్సూరెన్స్ జిల్లా క్లస్టర్ మేనేజర్ సతీష్, వారి బృందం, మండల వ్యవసాయ అధికారి ఎం. రామ్‌కుమార్, వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఎస్ఎన్ గొల్లపాలెం సచివాలయ హాలులో జరిగిన సమావేశంలో మాజీ ఎంపీటీసీ కే. సురేష్ మాట్లాడుతూ, ఋణం లేని రైతులు ఆగస్టు 15లోపు మీ సేవా కేంద్రాలు లేదా బ్యాంకుల ద్వారా ఎకరానికి వరి పంటకు రూ.830 ప్రీమియం చెల్లించి పంట బీమాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, అనూహ్య నష్టాల నుంచి రైతులకు రక్షణ కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
రుణం తీసుకున్న రైతులు బ్యాంకుల్లో నమోదు వివరాలు పరిశీలించాలి:
చిట్టిపాలెంలో జరిగిన సమావేశంలో సతీష్ మాట్లాడుతూ, బ్యాంకుల ద్వారా పంట రుణం పొందిన రైతుల ప్రీమియాన్ని సంబంధిత బ్యాంకులే చెల్లిస్తాయని, అయితే తమ పేరుతో పంట బీమా నమోదు పూర్తయిందో లేదో తప్పనిసరిగా బ్యాంకులో విచారించాలని సూచించారు. ఒకవేళ బీమా వద్దనుకునే ఎంపిక ఇచ్చి ఉంటే వెంటనే బ్యాంకును సంప్రదించి బీమా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. బీమా పరిహారం మంజూరైతే అది నేరుగా సంబంధిత రుణ ఖాతాకే జమ అవుతుందని వివరించారు.
పంట బీమా నమోదు సమయంలో ఆధార్ కార్డు, కౌలు కార్డు (వర్తించే వారికి), పంట సాగు ధ్రువీకరణ పత్రం తదితర పత్రాల జిరాక్స్ ప్రతులను సమర్పించాలని రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపేంద్ర, రాజు, పాండురంగ, వీఏఏ పూజిత, టాటా ఏఐజి ఇన్సూరెన్స్ బృందం, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సహాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

