కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకు ఆర్థిక, సామాజిక భరోసా: గొర్రెపాటి గోపీచంద్
మచిలీపట్నం:
గత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క కుటుంబానికీ భరోసా లేదని, ప్రస్తుత చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు విశేష కృషి చేస్తోందని ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు.
మచిలీపట్నం 45వ డివిజన్‌లో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్.వి.వి.ఎస్. బాపిరాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో అందుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాల పట్ల ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని మాట్లాడుతూ.. గత పాలకులు యువతను గంజాయికి బానిసలుగా మార్చి వారి భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరిల సారథ్యంలో మచిలీపట్నం పోర్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, పోర్టు అనుబంధ పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయని పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఖచ్చితంగా అందిస్తామని స్పష్టం చేశారు. స్థానికులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా సచివాలయ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బత్తిన అగస్తీశ్వరరావు, గంజాల రవికుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

