MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తృతం చేసి ప్రజలకు చేరువ చేయాలి

  • August 29, 2026
  • 1 min read
రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తృతం చేసి ప్రజలకు చేరువ చేయాలి
  • జిల్లాలోని అన్ని కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో యూత్, జూనియర్ రెడ్‌క్రాస్ ఏర్పాటు
  • సీపీఆర్, ప్రథమ చికిత్సపై పీఈటీలకు ప్రత్యేక శిక్షణ
  • రెడ్‌క్రాస్‌కు భూమి, బ్లడ్ బ్యాంక్ పరికరాల సమకూర్పునకు చర్యలు

––ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం:

ప్రజలకు అత్యవసర సమయాల్లో అండగా నిలిచేలా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి, జిల్లాలో రెడ్‌క్రాస్ కార్యకలాపాలను బలోపేతం చేయాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు సీపీఆర్, ప్రథమ చికిత్స వంటి ప్రాణరక్షణ శిక్షణలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక కార్యకలాపాల నివేదిక, ఆడిట్ ఖాతాలు, ఆదాయ-వ్యయ వివరాలను సమర్పించి ఆమోదించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్, కార్యాచరణ ప్రణాళికపై చర్చించి ఆమోదం తెలిపారు. అనంతరం రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలకు విశేషంగా సహకరించిన వారిని ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరానికి రెడ్‌క్రాస్‌కు లభించిన అవార్డు, మెడల్ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని, రెడ్‌క్రాస్‌లోని ప్రతి సభ్యుడు, వాలంటీర్, సిబ్బంది సమిష్టి కృషికి లభించిన గుర్తింపుగా భావించాలని అన్నారు. అవార్డును ఒక ప్రతినిధిగా కలెక్టర్‌కు అందజేసినప్పటికీ, అది మొత్తం రెడ్‌క్రాస్ బృందానికి చెందుతుందని పేర్కొన్నారు.

యూత్, జూనియర్ రెడ్‌క్రాస్ ఏర్పాటు

జిల్లాలోని అన్ని కళాశాలల్లో యూత్ రెడ్‌క్రాస్‌ను, అన్ని ఉన్నత పాఠశాలల్లో జూనియర్ రెడ్‌క్రాస్‌ను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పాఠశాల స్థాయిలో కార్యక్రమాలు చురుగ్గా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జూనియర్ రెడ్‌క్రాస్ ఏర్పాటు, ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై పీఈటీలకు శిక్షణ అందించేందుకు మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ ప్రాంతాల్లో మూడు ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు. ఈ వర్క్‌షాప్‌ల ద్వారా పీఈటీలకు జూనియర్ రెడ్‌క్రాస్ ఏర్పాటు విధానం, ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై అవసరమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్‌లో సరైన సీపీఆర్, ప్రథమ చికిత్స అందించడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. రెడ్‌క్రాస్ ద్వారా అందించే ఒక్క శిక్షణ కూడా భవిష్యత్తులో ఒక ప్రాణాన్ని కాపాడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

రెడ్‌క్రాస్‌కు భూమి, బ్లడ్ బ్యాంక్ పరికరాల సమకూర్పు

మచిలీపట్నంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం పక్కన, అదేవిధంగా చల్లపల్లి సబ్‌ బ్రాంచ్ రెడ్‌క్రాస్‌కు భూమి కేటాయింపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. బ్లడ్ బ్యాంక్‌కు అవసరమైన పరికరాలను సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ఎన్‌హెచ్‌పీసీ నుంచి సమకూర్చేందుకు ఎంపీ సహకరించేందుకు అంగీకరించినట్లు సమావేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టరేట్ నుంచి సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు మండలాల వారీగా షెడ్యూల్ రూపొందించి విడుదల చేయాలని కలెక్టర్ సూచించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లు, సేవా సంస్థల సహకారంతో రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించేలా సమన్వయం చేయాలని ఆదేశించారు.

సమావేశంలో ఇంచార్జ్ డిఆర్ఓ ఎస్ పోతురాజు, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డి.ఆర్.కె. ప్రసాద్, కార్యదర్శి శంకర్‌నాథ్ భవిరి, కోశాధికారి పడమట సుకుమార్, డిఇఓ యువి సుబ్బారావు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ సతీష్, కమిటీ సభ్యులు, రక్త దాతలు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN