కృష్ణా యూనివర్సిటీలో ఘనంగా జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవాలు
మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవ వేడుకలను శనివారం నాడు ఒకే వేదికపై అత్యంత వైభవంగా నిర్వహించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్, తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతులను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే. రాంజీ మాట్లాడుతూ… భారతీయ హాకీ చరిత్రలో మేజర్ ధ్యాన్ చంద్ సేవలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవని కొనియాడారు. తన క్రీడా జీవితంలో వెయ్యికి పైగా గోల్స్ సాధించి ప్రపంచ హాకీ రంగాన్ని నివ్వెరపరిచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అలాగే గిడుగు రామ్మూర్తి పంతులు గ్రాంథిక భాష స్థానంలో వాడుక భాషను ప్రవేశపెట్టి, తెలుగు వచనాన్ని ప్రజలందరికీ సులభంగా అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎం.వి. బసవేశ్వర రావు మాట్లాడుతూ… ధ్యాన్ చంద్ జీవిత ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు పండితులకు మాత్రమే పరిమితమైన తెలుగు భాషను పామరులకు సైతం అర్థమయ్యేలా తీర్చిదిద్దిన ధీశాలి అని పలికారు.
ఈ సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గత నాలుగైదు రోజులుగా నిర్వహించిన వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలను (బహుమతులను) అందజేశారు. డాక్టర్ పి. గోపి, ఆర్. దుర్గాప్రసాద్ ల సమన్వయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపల్స్ ఆచార్య ఎం. కోటేశ్వరరావు, డాక్టర్ ఎం. బాబురెడ్డి, డాక్టర్ పి. రాంబాబు, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

