ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని కోరుతూ ఏపిటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
మచిలీపట్నం:
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపిటీఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం మచిలీపట్నం ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బి. లంకేష్ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టంలోని 23(1) సెక్షన్‌ను సవరించి, ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు బోధిస్తున్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు మరోసారి అర్హత పరీక్ష నిర్వహించడం సమంజసం కాదన్నారు.
ప్రధాన కార్యదర్శి తాతా రేణుకారావు మాట్లాడుతూ టెట్ పరీక్ష విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు బోధించని సబ్జెక్టులను సైతం పరీక్ష సిలబస్‌లో చేర్చడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పరీక్ష విధానాన్ని పునఃసమీక్షించి, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు జి. సత్యనారాయణ మాట్లాడుతూ 20, 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ విద్యార్థులకు బోధిస్తున్న వారికి ఇప్పుడు అర్హత పరీక్ష నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల అనుభవాన్ని, సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేసేలా తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని పరిశీలించి, రాష్ట్రంలోనూ ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏళ్ల తరబడి విద్యారంగంలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులను మళ్లీ అర్హత పరీక్షల పేరుతో ఒత్తిడికి గురిచేయడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. టెట్ నిబంధనలపై ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, ఆచరణాత్మకమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్నాలో జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్. రామబ్రహ్మం, కె. శేషగిరి, కె. శ్రీనివాసరావు, వి. శివరామకృష్ణ, ఎన్. సంతోష్‌కుమార్, డి. జయప్రకాష్, వి. నాగమల్లేశ్వరరావు, పి. కరుణానిధి, డి. పరిమళరావు, జి. గోపాలకృష్ణ, పి. శాంతిలక్ష్మి, జి. రామలక్ష్మి, ఊటుకూరి సుబ్బారావు, ప్రభు, బి. వెంకయ్య, జి. హరి, బి. తుకారాం, రామ్‌ప్రసాద్, అహద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

