MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

మంగినపూడి తీరంలో గణపతి విగ్రహ నిర్మాణానికి సీఎం నివాసం నుంచి మట్టి సేకరణ

  • August 22, 2026
  • 1 min read
మంగినపూడి తీరంలో గణపతి విగ్రహ నిర్మాణానికి సీఎం నివాసం నుంచి మట్టి సేకరణ

మచిలీపట్నం:

మచిలీపట్నం మంగినపూడి బీచ్‌ వద్ద  ఏర్పాటు చేయనున్న 63 అడుగుల గణపతి విగ్రహ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం నుంచి మట్టిని సేకరించారు. “సాగరతీర మహాగణపతి ఉత్సవ సేవా సమితి” సభ్యులు… కొల్లు పునీత్‌ చంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఆయన చేతుల మీదుగా మట్టిని స్వీకరించారు.

మంగినపూడి బీచ్‌ను భవిష్యత్తులో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గణపతి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమితి సభ్యులు వివరించారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టిని సేకరిస్తున్నట్లు తెలిపారు.

63 అడుగుల గణపతి విగ్రహాన్ని మంగినపూడి సాగరతీరంలో ప్రతిష్టించడం ద్వారా భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు మంగినపూడి బీచ్‌ పర్యాటక ప్రాధాన్యతను మరింత పెంచేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రముఖుల చేతుల మీదుగా సేకరించిన మట్టితో గణపతి నిర్మాణం చేపట్టడం విశేషమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు, ప్రజలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని వారు కోరారు.

About Author

SSN