మంగినపూడి బీచ్ మహాగణపతికి ఆదివారం మట్టి సమర్పణ శోభాయాత్ర
మచిలీపట్నం:
వినాయక చవితి పండగను పురస్కరించుకుని మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద రూపుదిద్దుకుంటున్న 63 అడుగుల భారీ వినాయక విగ్రహ తయారీ కోసం ఆదివారం మధ్యాహ్నం “మట్టి సమర్పణ శోభాయాత్ర”ను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సాగర తీర మహాగణపతి ఉత్సవ సేవా సమితి అధ్యక్షులు చలమలచెట్టి నరసింహారావు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఈ శోభాయాత్ర ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక మూడు స్తంభాల సెంటర్ లోని వినాయక ఆలయం నుండి ప్రారంభమవుతుంది. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. మచిలీపట్నం పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజలు తమ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ శోభాయాత్ర ద్వారా విగ్రహ తయారీకి అందజేయనున్నారు. దాదాపు 5 వేల మంది భక్తులు ఇందులో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
ఆధ్యాత్మిక రథాలు, మంగళ హారతులు
ఈ శోభాయాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన విజయవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి, ద్వారకాతిరుమల, మచిలీపట్నం పాండురంగ స్వామి దేవాలయాలకు చెందిన ఆధ్యాత్మిక రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యాత్ర కోనేరు సెంటర్ కు చేరుకోగానే 108 మంది మహిళలు మంగళ హారతులు పట్టి స్వాగతం పలుకుతారు. అలాగే బీచ్ రోడ్డులో ఉన్న గ్రామాల ప్రజలు శోభాయాత్రకు స్వాగతం పలికేందుకు సమాయత్తమయ్యారు. భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు.

