మేయర్ పదవిపై జనసేనలో అసంతృప్తి..!
పుట్టినరోజు సమావేశం పేరుతో మేయర్ తీర్మానమా?
ఎవరినీ సంప్రదించకుండా ఏకగ్రీవ తీర్మానం ఎలా చేస్తారు? : కొట్టే వెంకట్రావు
మచిలీపట్నం:
మచిలీపట్నం మేయర్ పదవి వ్యవహారం జనసేన పార్టీలో అంతర్గత విభేదాలకు తెరలేపుతోంది. బండి రామకృష్ణను మేయర్‌గా ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తూ సంతకాల సేకరణ చేపట్టి పార్టీ అధిష్టానానికి పంపడంపై జనసేన నేత కొట్టే వెంకట్రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఏకగ్రీవం ఎక్కడ జరిగింది? కొంతమంది మాత్రమే సంతకాలు చేస్తే.. దానిని పార్టీ మొత్తం ఏకగ్రీవ నిర్ణయంగా ఎలా చూపిస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. మేయర్ పదవికి సంబంధించి ఇంకా చాలామంది నాయకులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి ఉందని, అందరి అభిప్రాయం తీసుకోకుండానే హడావిడిగా తీర్మానం చేయడం సరికాదని అన్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల ప్రణాళికపై చర్చించేందుకు పిలిచి, సమావేశంలో మేయర్ పదవికి సంబంధించిన తీర్మానం రాసుకుని సంతకాల సేకరణ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని కొట్టే వెంకట్రావు నిలదీశారు. గతంలో టీడీపీలో పనిచేసిన తనను జనసేనలోకి తీసుకువచ్చే సమయంలో తన రాజకీయ అనుభవం, ప్రజల్లో ఉన్న ఆదరణను గుర్తించి మేయర్ పదవికి తగిన అర్హత కలిగిన వ్యక్తిగా తనను నమ్మించారని తెలిపారు. జనసేన సిద్ధాంతాలను నమ్మి పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు మాట మార్చడం ఎందుకని ప్రశ్నించారు. “నాపై నమ్మకంతో పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఒక మాట.. ఇప్పుడు మరో మాట ఎందుకు?” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మేయర్ పదవిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే బదులు ముందుగా ఎంపీతో, అనంతరం పార్టీ అధిష్టానంతో చర్చించాలని డిమాండ్ చేశారు. తనకు రాజకీయ అనుభవంతో పాటు మున్సిపాలిటీ వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉందని, ప్రజల్లో తనకు ఆదరణ ఉందని పేర్కొన్నారు.
మేయర్ పదవి కోసం కొంతమంది సంతకాలు చేశారనే కారణంతోనే నిర్ణయం ఖరారైపోయిందా? లేక ఇంకా అందరి అభిప్రాయాలు తీసుకుంటారా? ఇదే ఇప్పుడు మచిలీపట్నం జనసేనలో ప్రధాన ప్రశ్నగా మారింది. మేయర్ పదవిపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు బయటపడటంతో.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

