MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

పెదపట్నానికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేరా?: మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి పేర్ని కిట్టు

  • August 21, 2026
  • 0 min read
పెదపట్నానికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేరా?: మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి పేర్ని కిట్టు

మచిలీపట్నం:

మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవిలో ఉన్న కొల్లు రవీంద్రకు ప్రజల కష్టాలు కనిపించడం లేదా? అని వైఎస్సార్‌సీపీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ప్రశ్నించారు. పెదపట్నం పంచాయతీ గ్రామాల ప్రజలు స్వచ్ఛమైన తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించి, మంత్రిగా కారులో తిరిగే అవకాశం కల్పిస్తే అదే ప్రజలకు గుక్కెడు స్వచ్ఛమైన మంచినీరు అందించలేని పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు.

మనసుంటే ప్రజల బాధలు కనిపించేవి!

పెదపట్నం గ్రామస్తుల దుస్థితిని మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా తెలుసుకోవాలని పేర్ని కిట్టు సూచించారు. ‘‘ మీకు మంచి మనసుంటే, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చేసిన ఈ మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల్లో పెదపట్నం గ్రామస్తులు కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. వారికి కనీసం తాగేందుకు స్వచ్ఛమైన నీరు కూడా ఇవ్వలేకపోతే మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరు ఇచ్చే కానుక ఇదేనా?’’ అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

కనీసం తినడానికి ఆహారం లేకపోయినా, ఏదో విధంగా జీవించగలమని, కానీ తాగడానికి సురక్షితమైన మంచినీరు లేకపోతే ప్రజలు ఎలా బతకాలని కిట్టు నిలదీశారు. పెదపట్నం వాసులు తాగునీటి కోసం పడుతున్న అవస్థలను అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే గుర్తించాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో నీటి సమస్యపై పలుమార్లు విన్నవించినా పరిష్కారం చూపకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

త్రాగునీరు ఇచ్చే వరకు కదలం

పెదపట్నం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని పేర్ని కిట్టు స్పష్టం చేశారు. ‘‘మాపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. పెదపట్నం వాసులకు స్వచ్ఛమైన మంచినీరు అందించే వరకు ఇక్కడి నుంచి కదలం విశ్రమించం’’ అని సవాల్‌ చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని, రాజకీయాలు పక్కనపెట్టి తక్షణమే పెదపట్నం గ్రామానికి స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. రంగు మారిన నీళ్లతో పెదపట్నం వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు.

ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన నాయకులు ముందుగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. పదవులు, అధికారిక హోదాలు ప్రజల సేవ కోసం ఉపయోగపడాలని, ప్రజలే ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదని కిట్టు వ్యాఖ్యానించారు. పెదపట్నం తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి గ్రామస్తులకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

About Author

SSN