MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

కరగ్రహారం బాబానగర్‌లో రూ.75 లక్షలతో మంచినీటి ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

  • August 14, 2026
  • 1 min read
కరగ్రహారం బాబానగర్‌లో రూ.75 లక్షలతో మంచినీటి ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని కొళాయి ద్వారా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో తాగునీటి మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, రిజర్వాయర్లు, పైప్‌లైన్లు నిర్మించి ఇంటింటికీ నీటి కనెక్షన్లు అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం బాబానగర్‌లో జలజీవన్ మిషన్ నిధులు రూ.75 లక్షలతో నిర్మించనున్న ఓవర్‌హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ పనులకు మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, గృహ నిర్మాణం తదితర మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో 100 శాతం సీసీ రోడ్లు పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయి కనెక్షన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గానికి జలజీవన్ మిషన్ కింద సుమారు రూ.6 కోట్ల నిధులు మంజూరయ్యాయని, బాబానగర్‌లో అంతర్గత పైప్‌లైన్ల కోసం మరో రూ.28.53 లక్షలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణంతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి గ్రామస్థులకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మచిలీపట్నం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు తరకటూరు నుంచి నీటి సరఫరా జరుగుతున్నందున, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక నీటి లైన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. పెదయాదర ప్రాంతంలో సుమారు 50 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఇందుకు సుమారు రూ.50 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు అమలైతే కాలేఖాన్ పేట, గుండెపాలెం, రుద్రవరం, చిన్నాపురం తదితర ప్రాంతాలకు అదనపు నీటి వనరులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

మచిలీపట్నం పట్టణంలో గతంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 2014-19 మధ్య కాలంలో ఎనిమిది రిజర్వాయర్లు నిర్మించి, ఇంటింటికీ మంచినీటి కొళాయి కనెక్షన్లు అందించినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. గృహ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. మచిలీపట్నంలో గతంలో నిర్మించిన జి+3 గృహ సముదాయాల్లో సుమారు 6,200 ఇళ్లకు చర్యలు చేపట్టి, 4,800 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందించడంతో పాటు కరగ్రహారం పరిసరాల్లోని గృహ కాలనీలకు రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. గృహ నిర్మాణానికి సుమారు రూ.10–12 కోట్ల నిధులు అందించేందుకు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.

రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడంతో పాటు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. మచిలీపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, 2027 మార్చి నాటికి మచిలీపట్నం పోర్టును ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పోర్టుకు అనుసంధానంగా మెడికల్ కాలేజీ సమీపం నుంచి రహదారి నిర్మాణం చేపడుతున్నామని, రైతుల సహకారంతో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు.

ఫిషింగ్ హార్బర్‌కు సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి, కల్వర్టు నిర్మాణం, విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత ఆధారంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, ఇందుకోసం ప్రతి సంవత్సరం సుమారు రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, లంకె శేషగిరిరావు తదితర కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN