హెల్మెట్ మీ శిరోభారం కాదు – భారంగా కాకుండా బాధ్యతగా ధరించండి: జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు
మీ ద్విచక్ర వాహన ప్రయాణంలో ప్రాణాలకు రక్షణగా.. మీ కుటుంబానికి అండగా ఉండేది హెల్మెట్
మచిలీపట్నం:
రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ అత్యంత కీలకమైన రక్షణ కవచమని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ను భారంగా కాకుండా బాధ్యతగా భావించి తప్పనిసరిగా ధరించాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సూచించారు. హెల్మెట్ ధరించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం మచిలీపట్నంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ. కోనేరు సెంటర్, రేవతి సెంటర్, బస్టాండ్, లక్ష్మీ టాకీస్ సెంటర్ మీదుగా జడ్పీ కన్వెన్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడటానికి, ప్రాణాలు కోల్పోవడానికి తలపై గాయాలు ప్రధాన కారణాల్లో ఒకటని తెలిపారు. చాలామంది హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తూ “కొద్దిదూరమే కదా.. హెల్మెట్ ఎందుకు?” అనే ఆలోచనతో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని, ఒక్క క్షణం జరిగే ప్రమాదం జీవితాంతం కుటుంబాన్ని విషాదంలోకి నెట్టివేయవచ్చని హెచ్చరించారు. మీరు హెల్మెట్ ధరించడం ద్వారా మీ ప్రాణాలను మాత్రమే కాదు.. మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ భవిష్యత్తును కూడా కాపాడిన వారవుతారని ఎస్పీ పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అనేది పోలీసుల భయంతో కాకుండా ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బాధ్యతగా ఉండాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోతే విధించే జరిమానా ప్రజలపై పోలీసులకు ఉన్న కోపంతో కాదని, చట్టాన్ని ఉల్లంఘించినందుకు విధించే చర్య మాత్రమేనని స్పష్టం చేశారు. రోడ్డు భద్రత అనేది పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించినప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలమని ఎస్పీ తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు నాణ్యమైన హెల్మెట్ ధరించడంతో పాటు, వాహనంపై వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించేలా చూసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

