MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

నగరంలో భారీ హర్ ఘర్ తిరంగా యాత్ర

  • August 11, 2026
  • 0 min read
నగరంలో భారీ హర్ ఘర్ తిరంగా యాత్ర

మచిలీపట్నం :

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో చారిత్రాత్మక మచిలీపట్నంలో భారీ మువ్వన్నెల జెండా యాత్ర ఘనంగా జరిగింది. “హర్ ఘర్ తిరంగా ” ప్రచార కార్యక్రమంలో భాగంగా రెండు వందల అడుగుల పొడవు భారీ మువ్వన్నెల పతాకంతో నిర్వహించిన ర్యాలీని ఎన్సీసీ 16వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రూపేష్ అవస్థి జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని వివిధ విద్యా సంస్థలు, పాఠశాలలకు చెందిన మూడు వందలకు పైగా ఎన్సీసీ క్యాడెట్లు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శనగా వందేమాతరం, హర్ ఘర్ తిరంగా నినాదాలతో చేసిన ర్యాలీ ప్రజలను ఆకట్టుకున్నది. భారతి కళాసమితి డప్పు కళాకారులు ప్రదర్శన అగ్రభాగాన లయబద్దమైన సంగీతంతో ఆకర్షణగా నిలిచారు. కోనేరు సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ వీధులగుండా సాగి ఆంధ్ర జాతీయ కళాశాల వద్ద ముగిసింది.

హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ, ప్రతి ఇంటా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడమే కాకుండా, నషా ముక్త్ భారత్, టీబీ ముక్త్ భారత్ వంటి సామాజిక సందేశాలను ఇవ్వడమే లక్ష్యమని కల్నల్ రూపేష్ అవస్థి చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక ఘట్టాలకు కేంద్రమైన మచిలీపట్నంలో మువ్వన్నెల జెండాను జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వయంగా పనిచేసిన ఆంధ్ర జాతీయ కళాశాల వరకూ ప్రదర్శించడం ద్వారా విద్యార్థులు ఒక చారిత్రాత్మక అనుభవంలో భాగమయ్యారని సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర అన్నారు. అదే విధంగా, ఈగల్ విభాగం సహకారంతో మత్తు పదార్ధాలకు వ్యతిరేకంగా నినాదాలతో ఎన్సీసీ 16వ బెటాలియన్ కేడెట్లు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్సీసీ కమాండెంట్ చందన్ ఠాకూర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN