కెడీసీసీ బ్యాంక్ కి ‘రికగ్నిషన్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డు
మచిలీపట్నం:
విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) ఫార్మేషన్ డే వేడుకల్లో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కృష్ణా డిసిసిబి) ప్రతిష్ఠాత్మక “రికగ్నిషన్ ఆఫ్ ఎక్సలెన్స్” అవార్డును అందుకుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్ల కు పైగా వ్యాపార పరిమాణం నమోదు చేసి అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ అరుదైన గౌరవం కృష్ణా డీసీసీ బ్యాంక్‌కు దక్కింది.
రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఆర్ సి ఎస్) సహకార శాఖ కార్యదర్శి బాబు.ఏ, ఐఏఎస్, ఆప్కాబ్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ వి. రామకృష్ణ చేతుల మీదుగా కృష్ణా డీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ ఈ పురస్కారం డైరెక్టర్ల మండలి, సీఈఓ, అధికారులు, ఉద్యోగులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్) ప్రతినిధులు, సభ్య రైతుల సమిష్టి కృషికి దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. రైతులకు మరింత మెరుగైన, పారదర్శకమైన, సాంకేతికత ఆధారిత బ్యాంకింగ్ సేవలను అందిస్తూ సహకార బ్యాంకింగ్ రంగంలో కృష్ణా డీసీసీ బ్యాంక్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.
ఈ అవార్డు కృష్ణా డీసీసీ బ్యాంక్ సేవల నాణ్యతకు, ఆర్థిక క్రమశిక్షణకు, రైతు సంక్షేమానికి అందిస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. సహకార రంగంలో వినూత్న కార్యక్రమాలు, డిజిటల్ సేవల విస్తరణ, రైతు కేంద్రిత బ్యాంకింగ్ విధానాల అమలుతో బ్యాంక్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల డీసీసీ బ్యాంకుల చైర్మన్లు, కృష్ణా డీసీసీ బ్యాంక్ సీఈఓ శ్యామ్ మనోహర్, బ్యాంకు ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

