MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

పుట్టగొడుగుల సాగు ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా

  • August 5, 2026
  • 1 min read
పుట్టగొడుగుల సాగు ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా

ఘంటసాల:

కృష్ణా జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక సహకారంతో ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్టగొడుగుల పెంపకంపై రైతులు, మహిళలు, యువతకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె. జ్యోతి మాట్లాడుతూ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, పుట్టగొడుగులు అధిక పోషక విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారమని తెలిపారు. మహిళలు, యువత మరియు స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నవారు పుట్టగొడుగుల సాగును లాభదాయకమైన ఉపాధి అవకాశంగా మలుచుకోవచ్చని పేర్కొన్నారు. ఉద్యాన శాఖ ద్వారా MIDH పథకం కింద పుట్టగొడుగుల యూనిట్ల స్థాపనకు 40–50 శాతం వరకు రాయితీ, PMFME పథకం ద్వారా ప్రాసెసింగ్‌కు అవసరమైన యంత్ర పరికరాల కొనుగోలుపై 35 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులు, మహిళలకు ఆమె సూచించారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ప్రాజెక్టు డైరెక్టర్ హరిహరనాథ్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి మహిళల ఆర్థిక సాధికారత ఎంతో అవసరమని అన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని, ఉద్యాన శాఖ మరియు వెలుగు శాఖల సమన్వయంతో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త జి. కృష్ణవేణి పుట్టగొడుగుల సాగుకు అవసరమైన వాతావరణ పరిస్థితులు, విత్తనం ఎంపిక, సాగు నిర్వహణ, చీడపీడల నివారణ, కోత అనంతర నిర్వహణ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై విపులంగా వివరించారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు ఎన్. రమేష్, జె. కీర్తి, ఘంటసాల, మొవ్వ మండలాల ఉద్యాన శాఖ అధికారులు (APMలు), రైతులు, మహిళా రైతులు, స్వయం ఉపాధిపై ఆసక్తి కలిగిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

SSN