MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

సహజ వ్యవసాయం, కృషోన్నతి యోజన, తేనెటీగల పెంపకానికి కేంద్రం ప్రాధాన్యం – ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం

  • August 4, 2026
  • 1 min read
సహజ వ్యవసాయం, కృషోన్నతి యోజన, తేనెటీగల పెంపకానికి కేంద్రం ప్రాధాన్యం – ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం

మచిలీపట్నం:

మచిలీపట్నం లోక్‌సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది. కృషోన్నతి యోజన, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (National Mission on Natural Farming) మరియు జాతీయ తేనెటీగల పెంపకం & తేనె మిషన్ (National Beekeeping and Honey Mission) లక్ష్యాలు, అమలు పురోగతి, అలాగే ఈ పథకాలను ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (PM-RKVY)లో విలీనం చేసే అంశాలపై ఎంపీ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, కృషోన్నతి యోజన వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన పథకం. ఆహార భద్రత, నాణ్యమైన విత్తనాల ప్రోత్సాహం, ఉద్యానవన అభివృద్ధి, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ మార్కెటింగ్, డిజిటల్ వ్యవసాయం, పంటల ఉత్పాదకత పెంపు వంటి అనేక కార్యక్రమాలు ఈ పథకం కింద అమలవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు కృషోన్నతి యోజన కింద రూ.211.23 కోట్లు (2024–25 లో )రూ.355.60 కోట్లు (2025–26 లో ) కేంద్రం విడుదల చేసినట్లు వెల్లడించింది. సహజ వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు నవంబర్ 2024 నుంచి జాతీయ సహజ వ్యవసాయ మిషన్ అమలులో ఉందని కేంద్రం తెలిపింది. రసాయన రహిత సాగు, నేల సారవంతత పెంపు, రైతుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం ఈ మిషన్ ముఖ్య లక్ష్యాలుగా పేర్కొంది. ఈ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌లో 5,002 క్లస్టర్లు ఏర్పాటు చేసి, 6,50,163 మంది రైతులను నమోదు చేసి, 4,25,912 హెక్టార్లలో సహజ వ్యవసాయాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని వివరించింది.

అదేవిధంగా జాతీయ తేనెటీగల పెంపకం & తేనె మిషన్ ద్వారా శాస్త్రీయ తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి పెంపు, నాణ్యత మెరుగుదల, పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, రైతుల ఆదాయ వృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం కాకుండా, ప్రాజెక్టుల ఆధారంగా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు పేర్కొంది.

ఈ పథకాలను PM-RKVYలో విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతం లేదని, వ్యవసాయ శాఖ పథకాలు ప్రస్తుతం PM-RKVY మరియు కృషోన్నతి యోజన అనే రెండు పథకాల కింద కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశాలపై సమగ్ర సమాచారం పార్లమెంట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రావడం రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు.

About Author

SSN