ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం:
ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్, కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ కే శ్రీధర్ రెడ్డి, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి పి నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ జి శ్రీనివాసరావుతో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన వివిధ శాఖల పెండింగ్ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) కె. శ్రీధర్ రెడ్డికి స్వాగతం పలికిన కలెక్టర్, గతంలో డీఆర్ఓగా పనిచేసిన అధికారుల మాదిరిగానే అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా అధికారులు కూడా డీఆర్ఓకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల అంశంపై మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అన్ని శాఖలు తమ పరిధిలో ఉన్న డిపాజిట్లను వెంటనే యాక్టివేట్ చేసి కలెక్టరేట్ పూల్ అకౌంట్‌కు బదిలీ చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే పునరుద్ధరించిన డిపాజిట్లలో ఇంకా సంబంధిత శాఖల వద్ద ఉన్న నిధులను రెండు మూడు రోజుల్లోపు తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించారు. ఇంకా పునరుద్ధరణ జరగని డిపాజిట్లపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క రూపాయి కూడా మిగలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పీజీఆర్ఎస్, సీఎం గ్రీవెన్సెస్, పీజీఆర్ఎస్ పోర్టల్లలో గడువు దాటిన ఫిర్యాదులు అధికంగా ఉన్న శాఖల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పంచాయతీ, మున్సిపల్ పరిపాలన, రెవెన్యూ, సర్వే, జలవనరులు, పోలీసు, రిజిస్ట్రేషన్, పౌర సరఫరాలు తదితర శాఖల అధికారులు పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై స్పష్టమైన చర్యలు తీసుకొని పరిష్కారం చూపాలని, “తర్వాత చర్యలు తీసుకుంటాం” వంటి సాధారణ వ్యాఖ్యలతో ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచరాదని సూచించారు. కోర్టు కేసు ఉన్నప్పటికీ స్టేటస్ కో లేదా స్పష్టమైన న్యాయపరమైన అడ్డంకి లేకుంటే సంబంధిత అధికారులు తమ పరిధిలో నిర్ణయాలు తీసుకొని చర్యలు చేపట్టాలని తెలిపారు.
అర్జీలలో కొన్ని:
- ఆంధ్రప్రదేశ్ యానాదుల ఎడ్యుకేషన్, పారిశుద్ధ కార్మికుల డెవలప్మెంట్ సొసైటీ, ఎరుకుల ఆత్మగౌరవ సంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో గిరిజనులు (యానాదులు) నివసిస్తున్న ప్రాంతాల్లో సచివాలయాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించాలని, ఆధార్ కార్డులు లేని గిరిజనులకు వెంటనే ఆధార్ కార్డులు జారీ చేయాలని కోరారు. అలాగే గిరిజనుల కోసం ప్రత్యేక వసతిగృహం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడంతో పాటు, వారిపై అకృత్యాలు, దౌర్జన్యాలు జరగకుండా పోలీసు రక్షణ కల్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.
- తాను వితంతువు, దివ్యాంగురాలినని, జీవనోపాధి లేకపోవడంతో ప్రభుత్వ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తన తల్లి బత్తిన కోటమ్మ వేరే చోట నివసిస్తున్నందున రేషన్ కార్డు నుంచి ఆమె పేరును తొలగించి తనకు ప్రత్యేక రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరారు. దీంతో వితంతు లేదా దివ్యాంగుల పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పించాలని మచిలీపట్నం మండలం ఈడేపల్లికి చెందిన చిట్టిబొమ్మ దుర్గ విజ్ఞప్తి చేశారు.
- మచిలీపట్నం 14వ వార్డు ఇంగ్లీష్‌పాలెం ప్రాంతానికి చెందిన స్థానికులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. గత కొన్ని రోజులుగా తమ ప్రాంతంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, నీరు వచ్చే సమయాలు కూడా నిర్దిష్టంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వాటర్ ట్యాక్స్‌ను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ పగటిపూట కనీసం గంటసేపు కూడా నీటి సరఫరా ఉండడం లేదని, రాత్రి వేళల్లో నీరు ఎప్పుడు వస్తుందో తెలియక మేల్కొని మోటార్లు పరిశీలించాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేలా సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించి, పగటి వేళల్లో నిర్ణీత సమయాలకు క్రమం తప్పకుండా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
కార్యక్రమంలో జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, డిపిఓ ఎం ధనలక్ష్మి, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరావు, మత్స్య శాఖ అధికారి అయ్యా నాగరాజా, వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు జ్యోతి రమణి, జే జ్యోతి, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ దయాకర్, సర్వే ఏడి లక్ష్మణరావు, డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, మెప్మా పిడి సాయిబాబు, డిటిడబ్ల్యూఓ ఫణి ధూర్జటి, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్ బాబు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

