MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ – అక్టోబర్ 3న తుది జాబితా విడుదల: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

  • July 25, 2026
  • 1 min read
జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ – అక్టోబర్ 3న తుది జాబితా విడుదల: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం:

కృష్ణా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–Special Intensive Revision) కార్యక్రమంలో తొలి దశ విజయవంతంగా పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

జిల్లాలో మొత్తం 15,43,242 మంది ఓటర్లు ఉండగా, వారిలో 14,05,580 మంది నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి అందాయని తెలిపారు. మిగిలిన 1,37,662 ఫారాలు తిరిగి అందకపోవడంతో వాటిని అన్‌కలెక్టబుల్ కింద నమోదు చేసినట్లు చెప్పారు. అన్‌కలెక్టబుల్‌గా నమోదైన వారిలో 56,346 మంది మరణించినవారు, 24,603 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినవారు, 34,650 మంది ఇప్పటికే ఇతర చోట్ల నమోదు కావడంతో డూప్లికేట్‌గా గుర్తించినవారు, 21,970 మంది ఇంటి వద్ద అందుబాటులో లేని వారు, 93 మంది ఇతర కారణాల కింద నమోదైనట్లు వివరించారు. మొత్తం ఓటర్లలో 8.92 శాతం అన్‌కలెక్టబుల్‌గా గుర్తించినట్లు తెలిపారు.

జూలై 31న ప్రచురించనున్నది ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితా మాత్రమేనని, ఇది బీఎల్ఓలు ఇంటింటి సర్వే ఆధారంగా రూపొందించిన ప్రాథమిక జాబితా అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ జాబితాలో పేరు లేకపోయిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫారం–6 ద్వారా పేరును చేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని, అనంతరం సంబంధిత వారికి నోటీసులు జారీ చేసి, వారి వాదనలు, సమర్పించిన పత్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని చెప్పారు.

ఇప్పటికే డిజిటైజ్ చేసిన 14,05,580 ఎన్యూమరేషన్ ఫారాల్లో, 13,82,660 మంది ఓటర్ల వివరాలు 2002 ఓటర్ల జాబితాలో ఉన్న వారి పేర్లు, తల్లిదండ్రులు లేదా తాత, అమ్మమ్మ/నానమ్మ పేర్లతో విజయవంతంగా మ్యాపింగ్ అయినట్లు తెలిపారు. వీరికి ఎలాంటి నోటీసులు జారీ చేయబోమని స్పష్టం చేశారు. నో మ్యాపింగ్’ కింద గుర్తించిన వారికి మాత్రమే నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. వారికి అవసరమైన పత్రాల జాబితాలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధ్రువపత్రాలు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కుల ధ్రువీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర కుల ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన భూమి లేదా గృహ కేటాయింపు పత్రాలు వంటి 11 రకాల పత్రాలు ఉన్నాయని తెలిపారు.

1987 జూలై 1కు ముందు జన్మించిన వారు తమకు సంబంధించిన ఏదైనా ఒక పత్రం సమర్పిస్తే సరిపోతుందని, 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య జన్మించిన వారు తమ పత్రంతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరి పత్రం సమర్పించాలని, 2004 డిసెంబర్ 2 తర్వాత జన్మించిన వారు తమ పత్రాలతో పాటు ఇద్దరు తల్లిదండ్రుల పత్రాలు సమర్పించాలని వివరించారు. ఈ ప్రక్రియలో ప్రతి ఓటరికి పూర్తి సహకారం అందించేలా బీఎల్ఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, ప్రజలకు అవసరమైన మార్గదర్శకత్వం అందించి, ఎవరికీ ఇబ్బందులు కలగకుండా అవసరమైన పత్రాలు సేకరించే చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు.

పాత్రికేయుల సమావేశంలో ఇన్చార్జి డిఆర్ఓ ఎస్ పోతురాజు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN