MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

ఆకట్టుకున్న బిఎస్సి నర్సింగ్ విద్యార్థుల ఎగ్జిబిషన్

  • July 21, 2026
  • 0 min read
ఆకట్టుకున్న బిఎస్సి నర్సింగ్ విద్యార్థుల ఎగ్జిబిషన్

మచిలీపట్నం :

మచిలీపట్నంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనాత్మక దృక్పథం, వైద్య సేవల పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యా కార్యక్రమాల్లో భాగంగా 2023–2027 బ్యాచ్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ పర్యవేక్షణలో, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నాయక్, డాక్టర్ శ్రీనివాస్, ఆర్‌ఎంఓ డాక్టర్ జి. భానుమూర్తి సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు సిద్ధం చేసిన వివిధ ఆరోగ్య నమూనాలు, వైద్య పరికరాల ప్రతిరూపాలు, ప్రజారోగ్యానికి సంబంధించిన అవగాహన ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కళాశాల ప్రిన్సిపాల్ రోజా రమణి మాట్లాడుతూ, తరగతి గది బోధనతో పాటు విద్యార్థుల్లో ఆచరణాత్మక పరిజ్ఞానం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు చూపిన ప్రతిభ అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఎగ్జిబిషన్‌ను సందర్శించిన వైద్యులు, అధ్యాపకులు విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను పరిశీలించి అభినందించారు. ప్రతి నమూనా వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలను విద్యార్థులు వివరించడంతో సందర్శకులు ఆసక్తిగా వీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, రోగుల సేవ, వ్యాధుల నివారణ, పోషకాహారం, పరిశుభ్రత తదితర అంశాలపై రూపొందించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమంలో నర్సింగ్ విభాగాధిపతి వరలక్ష్మి, అధ్యాపకులు దుర్గ భవాని, వసంత మాధవి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

About Author

SSN