రైతుల ఆదాయ పెంపునకు ఎఫ్‌పీఓల బలోపేతమే లక్ష్యం – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం:
రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు) గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) కార్యకలాపాలు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు, జాతీయ ఉద్యానవన బోర్డు (ఎన్‌హెచ్‌బీ) పథకాలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీఓలు)పై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఎగుమతుల ప్రోత్సాహం ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు ఎఫ్‌పీఓలు కృషి చేయాలని సూచించారు. ఎఫ్‌పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల అగ్రిగేషన్, నిల్వ, ప్రాసెసింగ్ కార్యకలాపాలను విస్తృతంగా చేపట్టేందుకు మల్టీ పర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్ల (ఎంపీఎఫ్‌సీలు)ను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

వ్యవసాయ యాంత్రీకరణను మరింత ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) పథకం కింద అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలను ఎఫ్‌పీఓలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిడ్డంగులు, అగ్రిగేషన్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, ప్రాసెసింగ్ యూనిట్లు వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, ఆర్థిక సంస్థలు, ఎఫ్‌పీఓలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్ తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా జిల్లాలోని ఎఫ్‌పీఓలకు అవసరమైన మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.
సమావేశంలో ఏపీఈడిఏ అసిస్టెంట్ మేనేజర్ సుకేష్ రుగాడా పాల్గొని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు, ఏపీఈడిఏ పాత్ర, ఎగుమతిదారుల నమోదు విధానం, సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్ ప్రమాణాలు, ఏపీఈడిఏ ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయ పథకాల గురించి వివరించారు. అదేవిధంగా జాతీయ ఉద్యానవన బోర్డు (ఎన్ బి హెచ్) డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ కొరిషెట్టర్ వాణిజ్య ఉద్యానవన అభివృద్ధి, పాలీహౌస్‌లు, నెట్ హౌస్‌లు, ప్యాక్ హౌస్‌లు, కోల్డ్ స్టోరేజీలు, మష్రూమ్ యూనిట్లు, నర్సరీల అభివృద్ధి, పంటల అనంతర నిర్వహణకు సంబంధించిన ఎన్ బి హెచ్ పథకాలు, సబ్సిడీ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఉద్యాన శాఖ జిల్లా అధికారి జ్యోతి మాట్లాడుతూ జాతీయ ఉద్యానవన బోర్డు (ఎన్‌హెచ్‌బీ) ద్వారా అమలు చేస్తున్న పథకాల కింద వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 35 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా రైతులు పండించిన మొత్తం ఉత్పత్తిలో 50 శాతం స్థానిక మార్కెట్‌లో విక్రయించేందుకు, 25 శాతం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ (ప్రాసెసింగ్) కోసం వినియోగించేందుకు, మిగిలిన 25 శాతం ఎగుమతుల కోసం సిద్ధం చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తే అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి జ్యోతి రమణి, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి సుధారాణి, మత్స్యశాఖ అధికారి అయ్య నాగరాజా, ఎల్డియం రవీంద్రారెడ్డి, ఎడి మణిధర్, ఉద్యాన అధికారులు జె కీర్తి, ఎన్ రమేష్, సిహెచ్ చందు జోసఫ్, ఈ హరిచంద్, ఎన్ మానస, వివిధ ఎఫ్‌పీఓల డైరెక్టర్లు, సీఈవోలు తదితరులు పాల్గొన్నారు.

