రహదారి ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం:
జిల్లాలో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో 2026 జనవరి నుండి మే నెల వరకు జరిగిన రహదారి ప్రమాదాల గణాంకాలను సమీక్షించారు. పోలీసు శాఖ నివేదికల ప్రకారం 2026 సంవత్సరంలో మే నెల వరకు జిల్లాలో మొత్తం 277 రహదారి ప్రమాదాలు నమోదవగా, వాటిలో 115 ప్రాణాంతక ప్రమాదాలు, 162 ప్రాణాంతకం కాని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 121 మంది మృతి చెందగా, 305 మంది గాయపడ్డారని అధికారులు వివరించారు.
ద్విచక్ర వాహనాలు, కార్లు ప్రమాదాలకు ప్రధాన కారణం
వాహనాల వారీగా పరిశీలించగా, 2026 మే నెల వరకు నమోదైన ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాలు 113 ప్రమాదాలతో మొదటి స్థానంలో, కార్లు, జీపులు, ట్యాక్సీలు, వ్యాన్లు 73 ప్రమాదాలతో రెండో స్థానంలో ఉన్నట్లు గుర్తించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం, మద్యం సేవించి వాహనాలు నడపకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలీసు శాఖకు సూచించారు.
జాతీయ రహదారులపై అధిక ప్రమాదాలు
రోడ్ల వారీగా సమీక్షలో జిల్లాలోని జాతీయ రహదారులపై అత్యధికంగా 138 ప్రమాదాలు నమోదై 64 మంది మృతి చెందగా, 167 మంది గాయపడ్డారు. ఇతర రహదారులపై 90 ప్రమాదాలు, రాష్ట్ర రహదారులపై 49 ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న బ్లాక్‌స్పాట్లను గుర్తించి తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టాలని జాతీయ రహదారుల అథారిటీ రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.
మే నెలలో 66 ప్రమాదాలు..
2026 మే నెలలో జిల్లాలో మొత్తం 66 రహదారి ప్రమాదాలు నమోదవగా, 30 మంది మృతి చెందారు, 60 మంది గాయపడ్డారు. మే నెలలో కూడా ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు, ట్యాక్సీలు, వ్యాన్ల వల్లే అధిక ప్రమాదాలు జరిగినట్లు సమావేశంలో వివరించారు. జాతీయ రహదారులపై రాత్రివేళ ప్రమాదాల నివారణకు అవసరమైన వీధి దీపాలు, హైమాస్ట్ లైట్లు, రిఫ్లెక్టివ్ సిగ్నేజ్, హెచ్చరిక బోర్డుల ఏర్పాటుపై జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో సమీక్షించారు. జాతీయ రహదారులపై వీధి దీపాలు వెలగట్లేదన్న ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయని, వచ్చే సమావేశం నాటికి వాటిని సరిదిద్దకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
సమావేశంలో అదనపు ఎస్పి వీవీ నాయుడు, జిల్లా రవాణా అధికారి ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాస్, జిల్లా ప్రజారవాణా అధికారి వెంకటేశ్వర్లు, రహదారులు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లోకేశ్వరరావు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, మచిలీపట్నం నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జాతీయ రహదారుల అథారిటీ ప్రతినిధులు, రాష్ట్ర రహదారులు, పోలీసు, రెవిన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

