MachilipatnamLocal News
June 3, 2026
స్పెషల్ స్టోరీ

సంక్షేమ పింఛన్ల పంపిణీ.. ప్రభుత్వ బాధ్యతా? రాజకీయ ప్రచారమా?

  • June 1, 2026
  • 1 min read
[addtoany]
సంక్షేమ పింఛన్ల పంపిణీ.. ప్రభుత్వ బాధ్యతా? రాజకీయ ప్రచారమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్ల అమలుకు చాలా సుదీర్ఘమైన, ఆసక్తికరమైన చరిత్ర ఉంది. వృద్ధులు, పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం కాలక్రమేణా ఎలా మారుతూ వచ్చిందో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పింఛన్ల ఆలోచనకు అంకురార్పణ చేసింది రాష్ట్ర మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. 1960లో ఆయన హయాంలోనే అత్యంత పేదరికంలో ఉన్న వృద్ధులకు సహాయం చేయడం కోసం ఈ వృద్ధాప్య పింఛన్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

మొదట్లో ఎంత ఇచ్చేవాళ్ళు?

ఈ పథకం ప్రారంభించిన కొత్తలో (1960వ దశకంలో) నెలకు కేవలం ₹15 నుంచి ₹30 లోపు మాత్రమే ప్రభుత్వ సహాయంగా అందించేవారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేదల జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ పింఛన్ల మొత్తాన్ని పెంచుకుంటూ వచ్చారు. 2004 కి ముందు ₹75 గా ఉన్న పింఛను మొత్తాన్ని వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ₹200 కు పెంచారు. 2014 లో రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పింఛను మొత్తాన్ని ₹200 నుండి ₹1,000 కు (దివ్యాంగులకు ₹1,500) పెంచింది. 2019 నుండి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విడతల వారీగా పెంచుకుంటూ 2024కి సాధారణ పింఛను మొత్తాన్ని ₹3,000 కు చేర్చింది. 2024 నుండి ప్రస్తుత కూటమి ప్రభుత్వం సాధారణ పింఛనును ₹4,000 కు పెంచింది. కేవలం వృద్ధులకే కాకుండా వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కిడ్నీ బాధితులు వంటి పలు వర్గాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వాలు లబ్ధిదారుల పరిధిని నిరంతరం పెంచుకుంటూ వస్తున్నాయి.

2019కి ముందు ప్రతి నెలా 1 నుండి 5 వ తారీఖు లోపు లేదా కొన్నిసార్లు నెల మధ్యలో కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల ద్వారా నగదు రూపంలో పింఛను ఇచ్చేవారు. గ్రామాలలో అయితే సర్పంచ్ లేదా పంచాయతీ సెక్రటరీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో అయితే వార్డు మెంబర్లు, సంబంధిత అధికారి సమక్షంలో లబ్ధిదారులు వచ్చి రిజిస్టర్‌ లో సంతకం లేదా బొటనవేలి ముద్ర వేసి డబ్బులు తీసుకునేవారు.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వృద్ధులైన ఫించను దారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతినెలా ఒకటో తారీకు ఉదయమే వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛను అందించే విధానాన్ని ప్రారంభించింది. తెల్లవారు జామున 5 గంటలకే వాలంటీర్లు తమ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లేవారు. ప్రభుత్వ యాప్ ద్వారా బయోమెట్రిక్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) స్కాన్ చేసి, అక్కడికక్కడే నగదును నేరుగా లబ్ధిదారుల చేతికి అందించేవారు. ప్రస్తుతం 2024 నుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫించను పంపిణీ గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది (వెల్ఫేర్ అసిస్టెంట్స్, పంచాయతీ సెక్రటరీలు మొదలైనవారు) చేస్తున్నారు.

బడ్జెట్ చట్టబద్ధత

సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ అనేది ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత. ఇది ప్రభుత్వం పేద ప్రజలపై చూపే ఉదారత లేదా దయాదాక్షిణ్యం కాదు. దీని వెనుక బలమైన రాజ్యాంగ హక్కులు, చట్టపరమైన బాధ్యతలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి పింఛను డబ్బు కూడా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ప్రజాధనమే. ప్రతి సంవత్సరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ సంక్షేమ పింఛన్ల కోసం వేల కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయిస్తూ చట్టసభల ఆమోదం పొందుతారు. ఇది ఒక అధికారిక బడ్జెట్ కేటాయింపు కాబట్టి, లబ్ధిదారులకు పింఛను అందించడం అనేది ప్రభుత్వ విధి అవుతుంది.

రాజ్యాంగబద్ధమైన బాధ్యత

భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 41 ప్రకారం దేశంలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు మరియు జీవనోపాధి లేని నిరుపేదలకు ప్రజా సహాయం అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. రాజ్యాంగం నిర్దేశించిన సంక్షేమ రాజ్య స్థాపనలో భాగంగానే ఈ పింఛన్ల పథకాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

సుప్రీం కోర్టు తీర్పులు

గౌరవ సుప్రీం కోర్టు కూడా పలు సందర్భాల్లో… వృద్ధులకు, లేవలేని స్థితిలో ఉన్నవారికి ఇచ్చే పింఛన్లు లేదా సామాజిక భద్రత అనేది వారి “జీవించే హక్కు”( రైట్ టు లైఫ్ – ఆర్టికల్ 21) లో భాగమని స్పష్టం చేసింది. గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమైన కనీస సహాయాన్ని అందించడం ప్రభుత్వాల ప్రాథమిక విధి అని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు పలు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలు కూడా గతంలో సంక్షేమ పథకాల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశాయి. “ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయడం ప్రభుత్వాల విధి. దాన్ని ఏదో ఒక రాజకీయ పార్టీ ఇస్తున్నట్టుగా, లబ్ధిదారులకు ఉపకారం చేస్తున్నట్టుగా చిత్రీకరించడం తగదు” అని కోర్టులు స్పష్టం చేశాయి.

రాజకీయ ప్రచారం – వాస్తవం

రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పింఛన్ల పథకాలకు తమకు నచ్చిన పేర్లు (ఇందిరమ్మ పింఛన్లు, ఎన్టీఆర్ భరోసా, వైఎస్సార్ పింఛన్ కానుక) పెట్టుకుని ప్రచారం చేసుకుంటాయి. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలలో “మేము అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతాం” అని హామీలు ఇస్తాయి. కాబట్టి, తామే స్వయంగా ఇస్తున్నట్లుగా ప్రజల్లో ఒక భావన కల్పిస్తాయి. కానీ వాస్తవంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ముఖ్యమంత్రి సీటులో ఉన్నా… పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ వ్యవస్థ ద్వారా, ప్రజాధనం తోనే సాగుతుంది. అందువల్ల, పింఛన్ల పంపిణీ అనేది ఏ ఒక్క నాయకుడిదో, పార్టీదో సొంత నిర్ణయం లేదా ఉదారత కాదు; అది ప్రజల సొమ్ముతో ప్రజా ప్రభుత్వం నెరవేర్చాల్సిన చట్టబద్ధమైన బాధ్యత.

వ్యక్తిగత గోప్యత మరియు గౌరవ హక్కు

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు, గోప్యత హక్కు ఉన్నాయి. పింఛను అనేది పేదరికం లేదా వృద్ధాప్యం వల్ల చట్టబద్ధంగా లభించే ఒక సామాజిక హక్కు.

డబ్బులు చేతిలో పెట్టి ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాలలో పెట్టడం, లబ్ధిదారుడి లిఖితపూర్వక అనుమతి లేకుండా వారి ఫోటోలను బహిరంగంగా వాడుకోవడం చట్టప్రకారం తప్పు. అలాంటి చర్యలపై లబ్ధిదారుడు తన ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని భావిస్తే, దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.

ఫోటోల నియంత్రణ

ప్రభుత్వ ప్రకటనలు లేదా అధికారిక కార్యక్రమాలలో కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ లేదా ప్రధానమంత్రి వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారి ఫోటోలు మాత్రమే ఉండాలని, స్థానిక నాయకుల ఫోటోలతో ప్రచారం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.

సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ సమయంలో రాజకీయ నాయకులు లేదా ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో (ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులతో) ఫోటోలు దిగి, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం అనేది నైతికంగా, చట్టపరంగా చాలా వివాదాస్పదమైన అంశం.

ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించడం తప్పు కాదు. కానీ, ప్రజాధనంతో ఇచ్చే పింఛన్లను తామేదో సొంతంగా ఇస్తున్నట్లుగా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టేలా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం చేసుకోవడం నైతికంగా తప్పు. అది చట్టపరమైన మార్గదర్శకాలకు విరుద్ధం.

శ్యామ్ కాగిత
మచిలీపట్నం

About Author

SSN