అర్జీల పరిష్కారంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం:
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ నారాయణ బందెల, డీఎస్పీ జి. శ్రీనివాసరావుతో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు.
అర్జీలలో కొన్ని:
తనకు నలుగురు ఆడపిల్లలు అని, పిల్లలకు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు లేవని, దీనివల్ల వారు చదువులు, సంక్షేమ పథకాలు పొందుటకు ఇబ్బందులు పడుతున్నారని, తమపై దయవుంచి వాటిని మంజూరు చేయాలని మచిలీపట్నం నగరంలోని 50వ డివిజన్ కు చెందిన టీ నాంచారమ్మ కలెక్టర్కు విన్నవించుకున్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, తక్షణమే వారికి ఆధార్ కార్డులు మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటిని ఆదేశించారు.
తనకు ఒక ఆడపిల్ల మగ పిల్లవాడు ఉన్నారని, కుమారుడికి వచ్చిన వ్యాధికి వైద్యం చేయించే స్తోమత లేక భర్త పురుగు మందు తాగి చనిపోయాడని, ప్రస్తుతం ఆడపిల్లకు ప్రమాదవశాత్తు కన్ను పోయిందని, సదరు వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం చేయాలని, అదేవిధంగా తనకు ఒంటరి మహిళ పింఛను, ఇళ్ల స్థలం మంజూరు చేయాలని గుడివాడ మున్సిపాలిటీ ఒకటవ వార్డుకు చెందిన బుడుమూరి శ్రీదేవి అర్జీ ద్వారా విన్నవించారు.
తన కొడుకు గోగులమూడి విజయ్ కుమార్ 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం వస్తున్న రూ.6వేలు పింఛన్కు బదులుగా రూ.15 మంజూరు చేసి ఆదుకోవాలని, అదేవిధంగా వీల్ చైర్ మంజూరు చేయాలని గుడివాడ మండలం, మోటూరు గ్రామానికి చెందిన జి మరియమ్మ కలెక్టర్ను కోరగా, ఆయన డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ యుగంధర్ ని పిలిపించి అర్హత మేరకు అతనికి పింఛను మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారిణి జే జ్యోతి, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజా, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారురి జి రమేష్, డీఎస్ఓ జి మోహన్ బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరాం ప్రసాద్, డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, హౌసింగ్ పీడీ వెంకట్రావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

