MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

యువత ఉపాధికి, బందరు అభివృద్ధికి ఇది కీలక అడుగు : మంత్రి కొల్లు రవీంద్ర

  • May 25, 2026
  • 1 min read
[addtoany]
యువత ఉపాధికి, బందరు అభివృద్ధికి ఇది కీలక అడుగు : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

మచిలీపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ద్వారా కొత్త పారిశ్రామిక శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

“నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు” కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం మచిలీపట్నం పోర్టుకు సమీపంలోని కరగ్రహారంలో మంత్రి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజితో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టుకు సమీపంలో సుమారు 20 నుంచి 21 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో దాదాపు 82 పారిశ్రామిక ప్లాట్లు ఏర్పాటు చేయనున్నామని, ఒక్కో ప్లాట్ 600 నుంచి 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండనున్నట్లు వెల్లడించారు. పార్కులో అవసరమైన అన్ని మౌలిక వసతులను ఎంఎస్ఎంఈ శాఖ ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పోర్టు ఆధారిత సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఈ పార్కు కేంద్రంగా మారుతుందని మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోతేపల్లి ఆటోనగర్, గోల్డ్ కవరింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ పార్కుల అభివృద్ధిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అక్కడ వేలాది మందికి ఉపాధి లభిస్తోందని, ఇదే విధంగా కొత్త ఎంఎస్ఎంఈ పార్కు కూడా ఈ ప్రాంతానికి మరింత అభివృద్ధి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2014-19 కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు భూసేకరణకు రూ.200 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు.
2026 డిసెంబర్ లేదా 2027 జనవరి నాటికి బందరు పోర్టును ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వెల్లడించారు. పోర్టు ప్రారంభానికి ముందే పరిసర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే యువతకు శిక్షణ, బ్యాంకు రుణాలు, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మచిలీపట్నంలో షిప్ బిల్డింగ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, ఇప్పటికే మూడు కంపెనీలు ఆసక్తి చూపినట్లు తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. షిప్ బిల్డింగ్ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

అక్రమ మట్టి తవ్వకాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు. అనుమతులు లేకుండా మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తే యంత్రాలు, ట్రాక్టర్లను సీజ్ చేయడమే కాకుండా సహకరించే అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టబద్ధంగా అనుమతులు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వాకల్చర్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, పరిశ్రమల అభివృద్ధి లేకుంటే సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. పరిశ్రమలు ఏర్పడితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం లభించి మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తూ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గానికి పోర్టు ఉండటం ఒక ప్రత్యేకత కాగా, పోర్టు ఆధారిత పరిశ్రమలు రావడం ద్వారా అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.

పోర్టుకు ఆనుకుని 21 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో దాదాపు 83 పారిశ్రామిక ప్లాట్లు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. శంకుస్థాపన అనంతరం లేఅవుట్ అభివృద్ధి చేపట్టి, పరిశ్రమలకు ప్లాట్లు కేటాయించి వీలైనంత త్వరగా పరిశ్రమలను స్థాపించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అలాగే మంత్రి కొల్లు రవీంద్ర చొరవతో నియోజకవర్గ పరిధిలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశాలపై సర్వే నిర్వహించామని, ప్రతిపాదనలు ప్రభుత్వానికి త్వరలో పంపనున్నామని చెప్పారు. భవిష్యత్తులో నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమలు స్థాపనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించారు.

యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం “కౌశల్యం” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత నమోదు చేసుకుంటే, వారికి నైపుణ్య పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ఉద్యోగాలు కల్పించే సంస్థలకు పంపుతున్నట్లు తెలిపారు. అర్హత సాధించిన వారికి విజయవాడలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించి “కౌశల్యం” కార్యక్రమంలో నమోదు చేసుకోవాలని సూచించారు. పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొనడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో డి సి ఎం ఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ దీవెన్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కూటమి నాయకులు లంకె శేషగిరిరావు, తలారి సోమశేఖర్, తిరుమల రావు, కే సుశీల, కాగిత గోపాలరావు తదితర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author

SSN