పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం
మచిలీపట్నంలో రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదు
పరిశుభ్ర బందరు సాకారంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం:
మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఈ మేరకు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ తో కలిసి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 23 నుండి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రతి పౌరుడూ బాధ్యతతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం కోనేరు సెంటర్లో రోడ్లపై పేరుకున్న చెత్తను చీపుర్లతో ఊడ్చారు. డివైడర్ మధ్యలో పేరుకున్న చెత్తను తొలగించారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, మన్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టి చెత్త, మురుగు మొత్తం శుభ్రం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆ మేరకు చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణాన్ని సాకారం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీలను సాధించుకునేందుకు సచివాలయాల వారీగా అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలి. నాయకులు ముందుండి బాధ్యత తీసుకోవాలి. సచివాలయాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి స్వచ్ఛతను పాటించాలి. ట్రీ గార్డులు ఏర్పాటు చేసి చెట్లను పరిరక్షించుకుందాం. శ్మశానాలు, పార్కుల్లో కూడా చెత్త లేకుండా అభివృద్ధికి ప్రధాన్యమివ్వాలి. అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులకు ప్రజలు, కార్పొరేట్ వ్యవస్థల భాగస్వామ్యం అత్యంత అవసరం. మచిలీపట్నం మెయిన్ రోడ్డులో గల శ్మశాన వాటికలో ఫీనిక్స్ సంస్థ రూ. కోటి వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే కార్యక్రమాలతో వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మచిలీపట్నం కోనేరు సెంటర్లో ఒక స్వచ్ఛంద సంస్థ రూ.10 లక్షల వ్యయంతో మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ, తర్వాత నిర్వహణ లేకపోవడంతో మరుగున పడ్డాయి. త్వరలోనే వాటిని తెరిపిస్తాం. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రజల సహకారం అత్యంత అవసరం. రోడ్లపై పశువులు తిరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై తిరిగే పశువుల్ని ఇతర ప్రాంతాలకు తరలించి, రోడ్లపై ప్రమాదాలు జరగకుండా అడ్డుకుంటుంటే ఉద్దేశ్యపూర్వకంగా కసులు వేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఫణంగా పెట్టాలనుకుంటున్నారు. గేదెలు రోడ్లపై ఉంటే తప్పకుండా వాటిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం. మచిలీపట్నం మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సరఫరా చేసే చోట చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. 2014-19 మధ్య కాలంలో 8 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాం. తర్వాత వాటిని నిర్వహణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శివారు ప్రాంతాల్లో ఎదురవుతున్న తాగునీటి ఇబ్బందులు కూడా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటల పాటు నీటి సరఫరా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మచిలీపట్నం తీర ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవిశంకర్ హామీ ఇచ్చారు. అదే సమయంంలో అక్కడి స్కిల్ డెవలప్మెంట్ పరిశీలించాను. అదే స్థాయి కేంద్రాన్ని బందరులో ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాం. విద్యా వ్యవస్థలో మార్పులకు కొంత మంది ప్రైవేటు సంస్థలు ముందుకొస్తున్నారు. 20 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. బందరు పోర్టు పూర్తైతే అనేక సంస్థలు వస్తాయి. ఇక్కడి యువతకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డి.కె.బాలాజీ , మున్సిపల్ కమిషనర్ బాపిరాజు , డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ , మున్సిపల్ మాజీ ఛైర్మన్ బాబాప్రసాద్ , ఏఎంసీ ఛైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

