పెండింగ్ బిల్లులు చెల్లించాలని హమాలీల నిరసన
మచిలీపట్నం:
రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలకు పెండింగ్ లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్‌లోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద హమాలీ కార్మికులు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 6 వేల మంది హమాలీలకు గత మే నెల బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు బిల్లులు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చినా అమలు చేయడం లేదని విమర్శించారు. సకాలంలో బిల్లులు అందకపోవడంతో హమాలీల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు వెంటనే పెంచాలని, 2026 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసి బకాయిలు (ఏరియర్స్) చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే హమాలీలందరికీ ఈఎస్ఐ పథకాన్ని తక్షణమే అమలు చేసి, కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో పలువురు హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

