MachilipatnamLocal News
July 21, 2026
మచిలీపట్నం

ఇంధనాల వినియోగంలో పొదుపు పాటించాలి –– మంత్రి కొల్లు రవీంద్ర

  • May 16, 2026
  • 0 min read
[addtoany]
ఇంధనాల వినియోగంలో పొదుపు పాటించాలి –– మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

మధ్య పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల ప్రభావం భారత్‌పై పడకుండా ఉండేందుకు ప్రజలందరూ పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్, విద్యుత్ వంటి ఇంధనాల వినియోగంలో పొదుపు పాటించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి సైకిల్‌పై ప్రయాణించి నగరంలోని మచిలీపట్నం బస్ స్టేషన్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి బస్ స్టేషన్‌లో ఉన్న కొంతమంది మహిళా ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడి ఇంధన పొదుపు అవసరంపై అవగాహన కల్పించారు. ఇంట్లో వంట కోసం ఎల్పీజీ గ్యాస్ లేదా విద్యుత్ స్టౌవ్‌లను ఉపయోగిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మధ్య పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్) సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితుల ప్రభావం భారత్‌పై పడకుండా ఉండేందుకు ప్రజలందరూ పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్, విద్యుత్ వంటి ఇంధనాల వినియోగంలో పొదుపు పాటించాలని కోరారు.

గృహావసరాల కోసం సౌర శక్తి వినియోగాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా సాంప్రదాయ ఇంధనాలపై భారం తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి సాధ్యమైనంత వరకు బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు సైకిళ్లు, విద్యుత్ వాహనాలు వినియోగించాలని సూచించారు. ఇంధన పొదుపు ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని, భవిష్యత్ తరాలకు సహజ వనరులను సంరక్షించిన వారమవుతామని మంత్రి తెలిపారు.

మంత్రి వెంట మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణి కుమార్, కూటమి నాయకులు లోగిశెట్టి వెంకటస్వామి, తలారి సోమశేఖర్ తదితర నాయకులు ఉన్నారు.

About Author

SSN