MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

అనుమతులు మంజూరైనా పరిశ్రమలు ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • May 14, 2026
  • 0 min read
[addtoany]
అనుమతులు మంజూరైనా పరిశ్రమలు ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

జిల్లాలో అనుమతులు పొందిన పరిశ్రమలు వెంటనే నెలకొల్పేందుకు లబ్ధిదారులు ముందుకు రావాలని లేనిపక్షంలో రద్దు పరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో పరిశ్రమల స్థాపన పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా సమీక్షించారు. చాలామంది లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ స్వయంగా ఫోన్లో మాట్లాడి పరిశ్రమల యూనిట్లు ఎందుకు ప్రారంభించడం లేదని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే నిర్మాణ పనులు మొదలు పెట్టాలని వారికి సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 370 దాకా పరిశ్రమలకు మల్లవల్లి , వీరపునేనిగూడెం పారిశ్రామిక వాడలలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సులభతర వ్యాపారం…. వేగవంతమైన వ్యాపారం అనే నినాదంతో ముందుకెళ్తుందని, మంజూరైన పరిశ్రమల యూనిట్లు త్వరగా స్థాపించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. ఆ క్రమంలో జిల్లాలో పరిశ్రమలు విరివిగా నెలకొల్పేందుకు వీలుగా వారికి అవసరమైన స్థలం కేటాయింపు, భవన నిర్మాణ ఆమోదాలు, విద్యుత్తు , మంచినీరు తదితర మౌలిక సదుపాయాలతో పాటు అన్ని రకాల అనుమతులను త్వరితగతిన ఇవ్వడం జరిగిందన్నారు.

అనుమతులు ఇచ్చి ఒకటిన్నర సంవత్సరం అయినప్పటికీ ఏమాత్రం పరిశ్రమల యూనిట్ల నిర్మాణ పనులు చేపట్టకపోవడం సరైనది కాదన్నారు. చాలాసార్లు తాను ప్రత్యేక సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులతో మాట్లాడి వారికి కావలసిన అన్ని రకాల అనుమతులు ఇబ్బందులు లేకుండా వచ్చేలా చేసామన్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలన్నారు. కొద్ది రోజుల్లో వారు పనులు చేపట్టకపోతే వారికి మంజూరు చేసిన స్థలంతో పాటు అన్ని రకాల అనుమతులు రద్దు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ఇదే విషయం పరిశ్రమల అధికారులతో పాటు ప్రత్యేకంగా నియమించిన అధికారులు లబ్ధిదారులను చైతన్యపరిచి పరిశ్రమలు స్థాపించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా కొంతమంది భవన నిర్మాణం ఆమోదం కొరకు అవసరమైన దరఖాస్తు చేయకపోవడం విచారకరమన్నారు. అనుమతులు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించని లబ్ధిదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్ వెంకటరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, ప్రత్యేక అధికారులు జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి ఎస్ వెంకటరావు, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, డి టి డబ్ల్యూ ఓ ఫణి దూర్జటి, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, డి సి ఓ చంద్రశేఖర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి నరేష్, జిల్లా ఉపాధి కల్పనాధికారి బ్రహ్మం, డి ఎల్ డి వో సునీత శర్మ తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *