MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

గంజాయిపై ఉక్కుపాదం –– జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ

  • May 12, 2026
  • 1 min read
[addtoany]
గంజాయిపై ఉక్కుపాదం –– జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ

మచిలీపట్నం:

జిల్లాలో డ్రగ్స్ వినియోగం, అమ్మకం, రవాణాపై ఉక్కుపాదం మోపి గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఆయన జిల్లాలో డ్రగ్స్ వినియోగం, అమ్మకం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈగల్, మెరైన్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల బారిన పడుతున్న యువత, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు మత్తు మాయలో చిక్కుకుని తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత జీవితం అంధకారమవుతుందని, సమాజానికి చీడపురుగులా మారుతున్న ఈ దుర్వ్యసనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసైతే కుటుంబాలు కూడా తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. గంజాయి వినియోగం కారణంగా యువత మత్తులో చోరీలు, మహిళలపై అఘాయిత్యాలు వంటి నేరాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయని, వాటి నియంత్రణలో అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా సాయంత్రం వేళల్లో నిఘా పెంచాలని పోలీస్ అధికారులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ దుష్ప్రభావాలపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పారు. పగలు మాత్రమే కాకుండా రాత్రి సమయాల్లో కూడా బీట్లు నిర్వహించి నిఘా మరింత బలోపేతం చేయాలని, గంజాయి సరఫరాదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదకద్రవ్యాలకు బానిసైన బాధితులను డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించి కౌన్సిలింగ్ అందించాలని సూచించారు.సమావేశంలో డీఈవో యు వి సుబ్బారావు, వ్యవసాయ మత్స్యశాఖ అధికారులు ఎన్ పద్మావతి, అయ్యా నాగరాజా, సమగ్ర శిక్ష ఏపీసి ఆర్ కుముదిని సింగ్, స్పెషల్ బ్రాంచ్ సిఐ వై సత్య కిషోర్, ఈగల్, మెరైన్ టీం తో పాటు పలు అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *