MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి కృష్ణా జిల్లా సమీక్ష

  • May 12, 2026
  • 0 min read
[addtoany]
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి కృష్ణా జిల్లా సమీక్ష

మచిలీపట్నం :

జిల్లాలో ఆడపిల్లల పుట్టుక పెరిగేలా, ఫోక్సో చట్టం కట్టుదిట్టంగా అమలయేలా, యుక్త వయసులో గర్భం దాల్చకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడుతో కలసి స్త్రీ శిశు సంక్షేమం, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం, విద్యా, పోలీస్ శాఖల అధికారులతో యుక్త వయసులోనే గర్భధారణ, లింగ నిష్పత్తి, ఫోక్సో చట్టం అమలు తదితర అంశాలపై సమన్వయ సమావేశం నిర్వహించి శాఖల పరంగా తీరు తెన్నులను సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ కృష్ణాజిల్లా చాలా విషయాల్లో మంచి పురోగతిలో ఉందని ప్రశంసిస్తూ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కూడా ఎంతో శ్రద్ధతో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారన్నారు. జిల్లా లింగ నిష్పత్తిలో కాస్త వెనకబడి ఉందని ముఖ్యంగా రాష్ట్ర సరాసరి ప్రతి 1000 మంది మగవారికి 930 ఆడపిల్లలు ఉండగా కృష్ణా జిల్లాలో 921 మంది ఉన్నారన్నారు. జిల్లాలో ఆడపిల్లల పుట్టుక మరింత పెరగాల్సి ఉందన్నారు. జిల్లాలో ఫోక్సో చట్టం కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఫోక్ సో కేసులో ఇకపై గర్భస్రావం జరగరాదని, అలా జరిగితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలో 101 మంది పిల్లలు తప్పిపోయారని వారిని వెతికి పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో యుక్త వయసులో గర్భధారణ ఎక్కువగా ఉంటుందని, దీనిపై తల్లిదండ్రులకు పెళ్లయిన యువతీ యువకులకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా జిల్లాలో అంగన్వాడి కార్యకర్తల ద్వారా పరిశీలన జరిగినప్పుడు 16 సంవత్సరాల లోపు యువతులు 48 మంది గర్భం ధరించారన్నారు. అదే వైద్య శాఖ పరిధిలో గణాంకాలు పరిశీలిస్తే 1605 మంది 18 సంవత్సరాల లోపు యువతులు గర్భం ధరిస్తున్నారన్నారు. యుక్త వయసులోనే గర్భం దాల్చితే ఆరోగ్యానికి మంచిది కాదని సరైన అవగాహన కలిగించాలన్నారు. వీటన్నిటి కి సంబంధించి, మిషన్ వికాస్, మిషన్ వాత్సల్య, శక్తి, కిశోర్ వికాసం వంటి కార్యక్రమాలను కేవలం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు కలసి సమన్వయంతో పని చేయాలన్నారు.జిల్లాలో 8 ఐసిడిఎస్ ప్రాజెక్టులలో 6 సంవత్సరాల లోపు 65 వేల మంది పిల్లలకు గాను 42 వేల మంది పిల్లలకు ఆధార్ నమోదు చేయించారని ఇంకనూ 23 వేలమంది పిల్లలకు ఆధార్ నమోదు చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోనీ 25 అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లల్లో తక్కువ బరువుతో పిల్లలు ఉంటున్నారని వారికి సరైన పోషకాహారం అందించి బరువులు పెరిగేలా కృషి చేయాలన్నారు.

పామర్రు, కంకిపాడు, బంటుమిల్లి, గన్నవరం, మచిలీపట్నం, మొవ్వ ప్రాజెక్టులకు సంబంధించిన అంగన్వాడి సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో సరిగా పర్యటించడం లేదని అంగన్వాడీ కేంద్రాల స్థితిగతులను తెలుసుకోవడం లేదని ఇకపై అలా జరిగితే ఉపేక్షించేది లేదని క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో విద్యుత్తు మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు అన్ని ఉన్నాయా లేదా అని విచారించగా అందరూ ఉన్నట్లు చెప్పడంతో వెంటనే జిల్లా కలెక్టర్కు మండల ప్రత్యేక అధికారులను పంపించి క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించాలని ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలియజేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సామాజిక బాధ్యతగా కిశోర వికాసం , ఫోక్సో చట్టం గురించి ఉపాధ్యాయులకు విద్యార్థులకు సరైన అవగాహన కలిగించాలన్నారు. లైంగిక వేధింపుల గురించి కూడా వివరించాలన్నారు. కొందరు యువతులు ఆకర్షణలోనూ మోజులో పడి తెలిసి తెలియక తప్పుదారి పడుతున్నారని వారిని సరైన మార్గంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాలో 35 మంది అనాధ పిల్లలు బడి మానివేసినట్లు తెలుస్తోందని వారిని తిరిగి బడిలో చేర్పించేందుకు చొరవ చూపాలన్నారు.జిల్లాలో పదవ తరగతిలో ఉత్తీర్ణులు కానీ 1265 మంది విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి చదువు చెప్పేందుకు కృషి చేయాలన్నారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తల్లిదండ్రులు ఏ పని చేస్తే పిల్లలు దాన్ని అనుసరిస్తారన్నారు. సాధారణంగా తల్లిదండ్రులు చెబితే వారు ఆ పని చేయరన్నారు. మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారని పిల్లలకు మంచి చెడు చెప్పాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉందన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదో క్షేత్రస్థాయిలో మండల ప్రత్యేక అధికారులను పంపించి పరిశీలించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, డి ఐ ఓ డాక్టర్ కె ప్రేమ్ చంద్, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, బీసీ సంక్షేమం డిటిడబ్ల్యుఓ ఫణి ధూర్జటి, డిఇఓ సుబ్బారావు, సర్వ శిక్ష ఏపీసి కుమిదిని సింగ్, పలువురు సిడిపివోలు, ఐసిడిఎస్ సిబ్బంది, ఈగల్ బృందాలు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *