మచిలీపట్నం :
జిల్లాలోని నిరుద్యోగ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ప్రత్యేక నియామక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి. కె. బాలాజీ తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డా. పి. నరేష్ కుమార్ మాట్లాడుతూ, దుబాయ్ (UAE) లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు మరియు ఇజ్రాయెల్ దేశంలో హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
దుబాయ్‌లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలకు 25 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, కనీసం SSC విద్యార్హతతో పాటు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు AED 4000 నుండి AED 5000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఇజ్రాయెల్‌లో హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళలు ఇద్దరూ అర్హులని, GDA, ANM, GNM, B.Sc Nursing లేదా Post B.Sc Nursing అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరమని, ఎంపికైన వారికి సుమారు నెలకు రూ.1,99,770 వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు APSSDC నైపుణ్యం పోర్టల్‌లో నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. విదేశీ ఉపాధి ద్వారా యువత మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని, జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మరిన్ని వివరాలకు కొరకు 9676708041 సంప్రదించవచ్చు.

