సివిల్ సప్లైస్ అధికారులు దాడులు హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు
మచిలీపట్నం :
అక్రమ గ్యాస్ బండలు స్వాధీనం..
నగరంలో సివిల్ సప్లైస్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి అక్రమంగా వినియోగిస్తున్న గ్యాస్ బండలను స్వాధీనం చేసుకున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారనే సమాచారం మేరకు ప్రత్యేక బృందాలుగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా గృహ వినియోగ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధమని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల గ్యాస్ దుర్వినియోగంపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో సివిల్ సప్లైస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే విధంగా గ్యాస్ సిలిండర్ల వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ తెలిపారు.

