MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ విందు

  • May 5, 2026
  • 0 min read
[addtoany]
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ విందు

మచిలీపట్నం:

మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్, వారి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో చదువుతూ ఇటీవల జరిగిన పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన మొదటి ముగ్గురు విద్యార్థులు మొత్తం 56 మందికి , వారి తల్లిదండ్రులకు మునుపెన్నడూ లేని విధంగా వినూత్నంగా డిన్నర్, అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి పాఠ్య పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలన్నారు. కేవలం ఆ తరగతికి మాత్రమే ఉపయోగపడకుండా భవిష్యత్తులో పోటీ పరీక్షలకు కూడా ఎంతగానో తోడ్పడుతుందనీ తన స్వానుభావాన్ని సోదాహరణంగా వివరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషకు చాలా ప్రాముఖ్యత ఉందని, దాన్ని అర్థం చేసుకోవడం, రాయడం, మాట్లాడడం చాలా అవసరం ఉందన్నారు. ప్రతిభగల, మేధోసంపత్తి గల విద్యార్థులు కేవలం ఏదో ఒక డాక్టర్ గాను లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను స్థిరపడడం కాకుండా ఒక పెద్ద ఆసుపత్రి నిర్వహించి నలుగురికి ఉపాధి కల్పించడం లేదా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయడం వంటి విస్తృతమైన ఆలోచన కలిగి ఉండాలన్నారు.

తాము చదువుకునే రోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేవని నేడు మొబైల్ లో చాట్ జిపిటి, వాట్సాప్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయన్నారు. వాటిని స్మార్ట్ గా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిరోజు పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేవడం, చదువుకోవడం వంటి మంచి అలవాటును క్రమశిక్షణతో నిరంతరం పాటించాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి క్రమశిక్షణ, పట్టుదల ఉంటే అదే భవిష్యత్తులో మన జీవితంలో పైకి ఎదగడానికి మార్గం చూపుతుందన్నారు.

మొబైల్ ఫోన్ కు ఎక్కువగా అలవాటు పడితే మన మేదో సామర్థ్యం తగ్గిపోతుందని గుర్తుంచుకొని పరిమితంగా వినియోగించాలన్నారు. యుక్త వయసులో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆకర్షణకు లోనై పక్కదారి పడితే జీవితం దెబ్బతింటుందన్నారు. సమయం వృధా అయితే మరలా రాదని గుర్తుంచుకోవాలన్నారు. ఏదైనా అనుకున్నది అనుకున్నట్టుగా జరగదని , దానికి నిరాశ చెందరాదన్నారు. మరలా ఇంకొక మంచి అవకాశం కోసం ప్రయత్నం చేయాలన్నారు.

శిక్షణలో ఉన్న కలెక్టర్ నమ్రత అగర్వాల్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో వారి లక్ష్యాన్ని సాధించాలన్నారు. తల్లిదండ్రులను గుర్తుంచుకొని తప్పటడుగులు వేయకుండా ముందుకు సాగాలన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనుకున్నది నెరవేర్చుకోవాలన్నారు.

డీఈవో సుబ్బారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రేరణాత్మక సందేశాలతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేశారన్నారు. జిల్లా కలెక్టర్ కృషితో పదవ తరగతి పరీక్షల్లో 75% నుండి 80% విద్యార్థులు ఉత్తీర్ణుల స్థాయికి చేరుకుని రాష్ట్రంలో పదవ స్థానంలో నిలిచామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృషితో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే నిమిత్తం 1852 మంది విద్యా వాలంటీర్లను ఎంపిక చేసి వారి ద్వారా విద్యాబోధన చేస్తున్నామన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్, శిక్షణలో ఉన్న కలెక్టర్ ఉత్తమ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, శాలువలతో ఘనంగా సత్కరించి పతకాలు, మనసును జయించండి, నాకు ఉంది ఒక కల అనే వివిధ రకాల ప్రేరణాత్మక పుస్తకాలను అందజేసి అభినందించారు. తదనంతరం జిల్లా విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు అందరూ కలిసి జిల్లా కలెక్టర్ ను శిక్షణలో ఉన్న కలెక్టర్ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో డిఇఓ యు వి సుబ్బారావు ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు బీసీ సంక్షేమ అధికారి రమేష్ డిటిడబ్ల్యువో ఫణి ధూర్జటి, మచిలీపట్నం ఆర్డిఓ సాంబశివరావు పలువురు డిప్యూటీ డిఇఓ లు ఎంఈఓ లు ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లు విద్యార్థులు , వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *