[addtoany]
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి
తాగునీటి సమస్యలు, ప్రోటోకాల్ ఉల్లంఘన, అధికారుల గైర్హాజరీ, నిలిచిపోయిన నిధులు తదితర అంశాలపై చర్చ
మచిలీపట్నం:
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు.
స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గురువారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అధ్యక్షతన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సభ్యులు ప్రధానంగా తాగునీటి సమస్యలు, ప్రోటోకాల్, అధికారుల గైర్హాజరీ, నిలిచిపోయిన నిధులు తదితర అంశాలపై చర్చించారు.
ముఖ్యమైన సమావేశానికి ఉన్నతాధికారుల గైర్హాజరీపై అసహనం
రాజ్యాంగబద్ధంగా నిర్వహించే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రజాప్రతినిధులు తమ ప్రాంత సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదిక అని పేర్కొన్న చైర్‌పర్సన్, ఇటువంటి ముఖ్యమైన సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా ముఖ్య అధికారులు గైర్హాజరు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈఓను ఆదేశించారు.
స్టాంప్ డ్యూటీ నిధుల నిలుపుదలతో అభివృద్ధి పనులు కుంటుపాటు
జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు రావాల్సిన సుమారు రూ.23 కోట్ల స్టాంప్ డ్యూటీ నిధులను విడుదల చేయకపోవడం వల్ల గ్రామీణాభివృద్ధి పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని చైర్‌పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంజూరైన రూ.20 కోట్ల అభివృద్ధి పనుల్లో, నిధుల కొరతతో రూ.14 కోట్ల పనులను నిలిచిపోయాయన్నారు. తక్షణమే పెండింగ్ నిధులను విడుదల చేసి స్థానిక సంస్థలకు న్యాయం చేయాలని కోరారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఆగ్రహం
జిల్లా పరిషత్ నిధులతో పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించే సందర్భాల్లో స్థానిక జడ్పీటీసీలు, ఎంపీపీలను ఆహ్వానించకుండా అధికారులు ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని చైర్‌పర్సన్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను పక్కనబెట్టి కార్యక్రమాలు నిర్వహించడం తగదని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తీరప్రాంతాల్లో తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు అవసరం
జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా కృత్తివెన్ను వంటి తీర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని చైర్‌పర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్ చేయని అపరిశుభ్రమైన నీటిని సరఫరా చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆమె పేర్కొన్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అత్యవసరంగా స్పందించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
గ్రామీణాభివృద్ధి వేగవంతం కావాలంటే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయకుండా, అవసరమైన నిధులు సమయానికి కేటాయించి, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ముఖ్య లక్ష్యంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
సమావేశంలో జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎంఎస్ బేగ్, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

